బోర్డులంటే డోంట్కేర్!..బనకచర్ల డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికీ వివరణ ఇవ్వని ఏపీ

బోర్డులంటే డోంట్కేర్!..బనకచర్ల డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికీ వివరణ ఇవ్వని ఏపీ
  • బనకచర్ల డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికీ వివరణ ఇవ్వని ఏపీ
  • కృష్ణా, గోదావరి బోర్డులు లేఖలు రాసినా ఖాతరు చేయని పొరుగు రాష్ట్రం
  • కేంద్రం దన్ను చూసుకునే రెచ్చిపోతున్నదన్న వాదన
  • తెలంగాణ ఫిర్యాదు చేసినా పట్టించుకోని సీడబ్ల్యూసీ, పీపీఏ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డులను ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి 
డీటెయిల్డ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీపై వారంలోగా వివరణ ఇవ్వాలని రెండు బోర్డులు లేఖ రాసినా.. ఇప్పటి వరకు ఏపీ నుంచి స్పందన రాలేదు. డీపీఆర్ తయారీకి ఈ నెల 7న ఏపీ టెండర్లను పిలవగా.. ఆ టెండర్​ ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ ఈ నెల 10న తెలంగాణ ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ జనరల్, ఈ నెల 17న ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. అయితే, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాల మేరకు ఈ నెల 15న కృష్ణా బోర్డు, 17న గోదావరి బోర్డు ఏపీకి లేఖ రాశాయి. టెండర్ ప్రక్రియకు సంబంధించి వాస్తవాలు తెలియజేయాలని, వారంలోగా వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఏపీ దాని గురించి పట్టించుకోలేదు. తమకేం పట్టింపులేనట్టుగా.. బోర్డులంటే లెక్కలేనట్టుగా ఈ రాష్ట్రం వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. 

కేంద్రం అండ చూసుకునే.. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండ చూసుకునే ఏపీ ప్రభుత్వం ఇలా బోర్డులనూ లెక్క చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా బనకచర్లకు అనుమతులిస్తున్నామని చెప్పకనే చెప్పింది. నిబంధనల మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనమికల్ అప్రైజల్ చేపడ్తామని తెలంగాణకు తెలియజేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పింది. ఇదే అదనుగా ఏపీ ప్రభుత్వం కూడా తామేం చేసినా అడిగేవాళ్లెవరూ ఉండరన్న ఉద్దేశంతో ప్రాజెక్టుపై ముందుకెళ్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు, మన అధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఫిర్యాదు చేసినా.. ఆ సంస్థలు ఇప్పటికీ నోరెత్తడం లేదు. ఈ విషయంలో ఏపీని ప్రశ్నించడం లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణనూ కోరలేదు. గతంలో ఆ రెండు కేంద్ర సంస్థలు ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీ డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు టెండర్లు పిలిచిన వెంటనే తొలుత తెలంగాణ ఫిర్యాదు చేసింది ఆ రెండు కేంద్ర సంస్థలకే కావడం గమనార్హం. అయినా కూడా ఆ సంస్థలు ఏపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించేందుకే ఇలా సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.