గోదావరిపై ఏపీ మరో రెండు ప్రాజెక్టులు

 గోదావరిపై ఏపీ మరో రెండు ప్రాజెక్టులు

హైదరాబాద్‌, వెలుగు : గోదావరి నదిపై మరో 2 ప్రాజెక్టులను నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దపడుతున్నది. ఈ మేరకు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెంకట నగరం పంపింగ్ స్టేషన్ కు సంబంధించిన డీపీఆర్​లు అందించింది. పోలవరం ఎడమ కాలువ నుంచి 3 స్టేజీల్లో నీటిని ఎత్తిపోసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును తలపెట్టారు. రూ. 7,214.10 కోట్లతో 3 దశల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు, 12 వందల గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. గోదావరి నుంచి 90 రోజుల్లో 63.2 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు. ఇక రూ. 87.77 కోట్లతో రాజమండ్రి దగ్గరలోని వెంకటనగరం గ్రామం వద్ద పంపింగ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నారు. గోదావరి నుంచి 3.62 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 29,750 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతో పాటు 4,250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నారు. ఈ 2 డీపీఆర్ లు పరిశీలించి పర్మిషన్ ఇవ్వాలని గోదావరి బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది.