న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పెరుగుతోంది. వరిసాగు విస్తీర్ణం అధికమవుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, రైతులు ఈ సంవత్సరం ఇప్పటివరకు 979.88 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలను విత్తారు.
గత ఏడాది ఇదే కాలంలో 972.58 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వార్షిక ప్రాతిపదికన సాగు విస్తీర్ణం కొంత మేరకు పెరిగింది. ఈసారి వరి నాట్లు 328.22 లక్షల హెక్టార్లలో ఉండగా, గత ఏడాది ఇదే కాలానికి 312.80 లక్షల హెక్టార్లు ఉంది.
మనదేశం ఈ ఏడాది జులైలో బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వరి సాగు పెరిగింది. పప్పుధాన్యాల సాగును గమనిస్తే కంది, మినప, పెసర వంటివాటి సాగు తక్కువగా ఉంది.
గత ఏడాది 122.77 లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేయగా, ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు మొత్తం 113.07 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగయ్యాయి. వేరుశెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఇతర విత్తనాల సాగు కూడా 184.61 లక్షల హెక్టార్ల నుంచి 183.33 లక్షల హెక్టార్లకు తగ్గింది.