భూపాలపల్లిలో గండ్ర వర్సెస్ సత్యనారాయణ

భూపాలపల్లిలో గండ్ర వర్సెస్ సత్యనారాయణ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. -ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గండ్ర సత్యనారాయణరావు మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. గండ్ర వెంకటరమణారెడ్డి అవినీతి, ఆరోపణలు చేయడంతో వివాదం తలెత్తింది. మార్చి 2న ఉదయం 11 గంటలకు అంబేడ్కర్ విగ్రహం సెంటర్ లో చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే గండ్రకు కాంగ్రెస్ నేత సత్యనారాయణరావు సవాల్ విసిరారు. దాంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. 
ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి 144 సెక్షన్ అమలు చేశారు. -శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలు, బలప్రదర్శనపై నిషేధం విధించారు. 

మరోవైపు.. హనుమకొండలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. పోలీసుల చర్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం గండ్ర ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలను పూర్తి ఆధారాలతో రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తనను ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. 

అంతకుముందు.. ఎమ్మెల్యే గండ్రకు కాంగ్రెస్ నేత సత్యనారాయణరావు సవాల్ విసిరారు. ‘ఉదయం11 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వస్తాను.. -నీ భూ కబ్జాలు, నీ కుటుంబ అవినీతి నిరూపించలేకపోతే.. నా ముక్కు ఊడిపోయేదాకా అంబేద్కర్ ముందు నెలకు రాస్తా. ఒక్కడినే వస్తాను.. మీ దంపతులు ఇద్దరు రండి.. తేల్చుకుందాం. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో పాటు భూ అక్రమాలను నిరూపిస్తాను’ అంటూ సవాల్ విసిరారు. ఆయిల్ ట్యాంకర్లలో కలప స్మగ్లింగ్, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని, చాలా దందాల్లోనూ ఎమ్మెల్యే, ఆయన బినామీలు, అనుచరులు ఉన్నారని ఆరోపించారు.