
భద్రాచలం, వెలుగు : పోలీస్ ఇన్‌ఫార్మర్ అంటూ భద్రాద్రి జిల్లా చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో బంటి రాధను గత నెల 21న మావోయిస్టులు చంపారు. అయితే హత్యకు ముందు ఆమె మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘నేను ఇన్‌ఫార్మర్‌ను కాదు.. నాకే పాపం తెలియదు, ఒక వ్యక్తి నంబర్లు మారుస్తూ నాకు ప్రతి రోజు ఫోన్ చేసేవాడు, అతడు పోలీస్ అని తెలియడంతో తానేమీ చెప్పలేదు, అయితే నీ తమ్ముడు మా వద్ద బందీగా ఉన్నాడు, పార్టీ సమాచారం చెప్పకపోతే ఖతం చేస్తాం’ అని బెదిరించారని ఆడియోలో వాపోయింది.
తన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపించి, రెడ్ మార్క్ పెట్టి ఖతం చేస్తామని హెచ్చరించారని తెలిపింది. తర్వాత ‘మీరు ఎక్కడుంటరు ? మిమ్మల్ని ఎవరు కలుస్తరు ? ప్రజాసంఘాల వాళ్లు ఎవరు వస్తారు ?’ ఇలా అడిగారని అయినా తాను దేనికీ సమాధానం ఇవ్వలేదని తెలిపింది.