
ఆడబిడ్డ పుట్టిందని హాస్పిటల్ లోనే శిశువును వదిలేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఓ వృద్ధురాలు శిశువును మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ లోని నవజాత శిశువు కేంద్రానికి తీసుకెళ్లింది. తల్లి ఏదని అడగడంతో తన కుమార్తె కింద ఉందని చెప్పిన ముసలవ్వ..ఇప్పుడే వస్తానంటూ శిశువును అప్పగించి తిరిగి రాలేదని తెలిపారు వైద్య సిబ్బంది. మూడు గంటలైనా శిశువు కోసం ఎవ్వరూ రాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు.
వెంటనే హాస్పిటల్ కి చేరుకున్న ఐసీడీఎస్ సిబ్బంది శిశువు ఆరోగ్యం సరిగ్గా లేదని.. వారం తర్వాత బాలల సంరక్షణా కమిటీ ముందు హాజరుపరిచి, శిశుగృహ కేంద్రానికి తరలిస్తామన్నారు. ఈ మేరకు శిశువును వారం రోజుల పాటు వెంటలేటర్లో ఉంచుతామని తెలిపారు డాక్టర్లు. ఆడబిడ్డ పుట్టిందనే శిశువును వదిలించుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల అధారంగా శిశువును వదిలివెళ్లినవారిని వెతికే పనిలో ఉన్నామని తెలిపారు స్థానిక పోలీసులు.