ఉద్యమమే ఊతంగా రెడ్ టార్గెట్​

ఉద్యమమే ఊతంగా రెడ్ టార్గెట్​

సమాజంలో మార్పు రావాలనే బలమైన కోరిక ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది. రొటీన్‌‌కి భిన్నంగా ఓ చిత్రం తీసుకు రావాలనే కోరిక ఉద్యమాల బ్యాక్‌‌డ్రాప్‌‌ సినిమాలకి ఊపిరి పోస్తోంది. ఇలాంటి సినిమాలు రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా వచ్చాయి. త్వరలో మరికొన్ని రాబోతున్నాయి.

ఉద్యమమే ఊతంగా..


ఒకప్పుడు నక్సలైట్లు. ఇప్పుడు మావోయిస్టులు. ఏ పేరుతో పిలిచినా ఒకటే. వారి జీవితాల్లో ఆవేదన ఉంటుంది. వారి ఆలోచనల్లో ఆవేశం ఉంటుంది. వారి బతుకంతా ఎడతెగని పోరాటమే ఉంటుంది. అందుకే అది చాలా సినిమాలకు మెయిన్ థీమ్ అయ్యింది. ఎన్నో చిత్రాలు ఉద్యమాన్ని, ఉద్యమకారుల జీవితాల్ని కళ్లకు కట్టాయి. కృష్ణవంశీ తీసిన ‘సిందూరం’ సినిమాని ఇష్టపడని వారుండరు. చూసినవాళ్లు ఎన్నేళ్లయినా దాన్ని మర్చిపోలేరు. సొసైటీలో జరిగే అరాచకాల్ని భరించలేక పోలీస్ అవ్వాలనుకున్న ఓ యువకుడు నక్సల్ అవుతాడు. అతని లైఫ్‌‌ జర్నీ చాలా ఎమోషనల్‌‌గా ఉంటుంది. అతననే కాదు.. ఉద్యమ బాట పట్టిన ఏ వ్యక్తి జీవితమైనా అంతే. దాన్నే ఒక్కో ఫిల్మ్ మేకర్ ఒక్కోలా చూపిస్తాడు. ఒక్కో నటుడు ఒక్కోలా ప్రదర్శిస్తాడు. తన అక్క మావోయిస్టుగా మారినందుకు క్రికెటర్‌‌‌‌ కావాల్సిన శ్రీవిష్ణు లైఫ్ స్పాయిలైపోతుంది ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీలో. కొడుకు ఉద్యమం వైపు వెళ్లినందుకు ‘తిలాదానం’లోని తండ్రి, ‘హజారో చౌరాసీ కీ మా’లో తల్లి అష్టకష్టాలు పడ్డారు. దళం, చక్రవ్యూహ్, ఒసేయ్ రాములమ్మ, ఫోర్త్ రివర్, కాల్‌‌బేలా, లాల్‌‌ సలామ్, నక్సల్, పంచాగ్ని, తలప్పావు లాంటి ఎన్నో చిత్రాలు నక్సలిజం చుట్టూనే అల్లుకున్నాయి. ఆర్.నారాయణమూర్తి, మాదాల రంగారావు వంటి వారి సినిమాలు కూడా ఉద్యమాన్ని, దాని ప్రభావాన్ని  చూపించాయి.

కనెక్టివిటీ ఎక్కువ


‘అన్న’ అని అయితే తోడబుట్టినవాళ్లనో, కజిన్స్‌‌నో అంటాం. లేదా మనసుకు బాగా దగ్గరైనవారిని, మన మంచి కోసం ఆరాటపడేవారిని అంటాం. ఉద్యమకారుల్ని అన్నలని పిలిచేది కూడా అందుకే. వాళ్లు సొసైటీ కోసం, మార్పు కోసం ఆరాటపడతారు అనే నమ్మకం నుంచే ఆ పిలుపు పుట్టింది. సినిమా కథలో ఉద్యమాన్ని భాగం చేయడానికి కూడా అదే కారణమయ్యింది. ‘ఆచార్య’ సినిమానే తీసుకుంటే.. దేవాదాయ శాఖలో జరిగే అవినీతికి వ్యతిరేకంగా చిరంజీవి పోరాడతారట. ఆయన ఆశయాన్ని రామ్‌‌చరణ్ కొనసాగిస్తాడట. వీళ్లిద్దరికీ నక్సలిజం బ్యాగ్రౌండ్ ఉంటుందని పోస్టర్లు, టీజర్స్‌ ద్వారా స్పష్టమయ్యింది. అంటే ఆ పాత్రలు ఇన్‌‌స్పైరింగ్‌‌గా ఉంటాయి. హీరోయిక్‌‌గా ప్రజల కోసం పోరాడతాయి. ఇక ‘విరాటపర్వం’ కూడా నక్సలిజం బ్యాక్‌‌డ్రాప్‌‌లోనే వస్తోంది. ఓ యంగ్‌‌ అండ్ ఎనర్జిటిక్‌‌ యువకుడు ఉద్యమకారుడైతే ఏం జరుగుతుందనేది చూపించబోతున్నారు.  ఎప్పుడైతే సినిమాలోని ఓ పాత్ర ప్రజల కోసం పోరాడుతున్నట్టు, వారికి న్యాయం చేయడానికి తపిస్తున్నట్టు కనిపి స్తుందో.. ఆ పాత్ర అందరికీ నచ్చేస్తుంది. ఆ వ్యక్తిలోని హీరోయిజం కట్టి పడేస్తుంది. వెంటనే ఆ పాత్రతో కనెక్టయిపోతాడు ప్రేక్షకుడు. అందుకే సినిమాలకి ఈ బ్యాక్‌‌డ్రాప్‌‌ ప్లస్ అవుతోంది. 

సిరీసులూ వస్తున్నాయ్!


సినిమాలే కాదు.. నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వెబ్ సిరీసులూ వస్తున్నాయి. రకరకాల కొత్త కంటెంట్‌కి పెద్ద పీట వేస్తున్న ఓటీటీలు.. ఈ జానర్‌‌ని కూడా వదిలి పెట్టట్లేదు.  జీ5లో ‘నక్సల్‌బరీ’ అనే వెబ్‌ సిరీస్ స్ట్రీమ్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. రాజీవ్ ఖండేల్‌వాల్, ఆమిర్ అలీ, శ్రీజిత డే, టీనా దత్తాలతో పార్థో మిశ్రా తెరకెక్కించిన ఈ సిరీస్‌.. మహారాష్ట్రలోని నక్సల్ ఉద్యమం, ఆదివాసీల సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఎంతో నేచురల్‌గా, వాస్తవాలకి దగ్గరగా ఉండటంతో ఈ సిరీస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో సెకెండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది.

కొంచెం కథ.. కొంచెం వ్యథ


మరికొన్ని చిత్రాల్లోనూ  నక్సలిజం గురించి ఉంది. అయితే ఆ సినిమాలు పూర్తిగా దానిమీదే నడవవు. కథా పరంగానో, పాత్రల పరంగానో కొంత దానిపై బేస్ అయి ఉంటుందంతే. జీవా నటించిన ‘రంగం’ సినిమాలో నక్సలిజం ప్రస్తావన ఉంటుంది తప్ప కథంతా దాని మీదే ఆధారపడి కొనసాగదు. అలాగే ‘జల్సా’లో పవన్ కళ్యాణ్ కాసేపు మావోయిస్టుగా కనిపించాడు. కథానుసారం తను అడవికెళ్లి ఆయుధాన్ని పడతాడు తప్ప అదే సినిమాకి ముఖ్యం కాదు. ఇలా చాలా చిత్రాల్లో ఉద్యమం కథలో కొంచెమే మిక్సవుతుంది. దానిలోని వ్యథ మాత్రం ఆ క్యారెక్టర్స్‌‌ని వెంటాడుతూ ఉంటుంది. అంటే మొత్తంగా ఉద్యమ ప్రస్తావన ఉండీ ఉండనట్టుగా ఉంటుందన్నమాట.

సమస్యలూ ఎక్కువే!


ఇలాంటి సినిమాలతో సమస్యలు కూడా బాగానే వస్తాయి. రీసెంట్‌‌గా రిలీజైన ‘నయీం డైరీస్’ చిత్రమే అందుకు ఉదాహరణ. గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌, మాజీ నక్సలైట్‌‌ నయీం లైఫ్ స్టోరీ ఇది. ఉద్యమ పాటల గాయని బెల్లి లలితకి నయీంతో అనుబంధం ఉందని చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అది ఆమె ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌‌కి కోపం తెప్పించింది. దర్శక నిర్మాతల్ని కోర్టు మెట్లు ఎక్కించింది. ఆమధ్య ఉస్మానియా కేంద్రంగా ఉద్యమాన్ని నడిపిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ వచ్చినప్పుడూ వివాదాలు తప్పలేదు. ఉద్యమ ఉద్దేశాల్ని వక్రీకరించారంటూ గతంలో ‘ట్యాంగో చార్లీ’ అనే బాలీవుడ్ చిత్రాన్ని అస్సాంలో బ్యాన్ చేశారు. నిజాల్ని చూపించామని డైరెక్టర్స్ అంటారు. జరిగింది మానేసి తమకు తెలిసింది తీశారని గొడవకు దిగినవారు అంటారు. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు యాంటీ నక్సల్స్‌‌ నిరసనలు కూడా ఉంటాయి. హీరోని ఉద్యమకారుడిగా చూపిస్తే ప్రేక్షకుడికి ఊపొస్తుం దేమో కానీ.. ఆ ఐడియాలజీని ఇష్టపడని వారికి మాత్రం చెప్పలేనంత కోపం వస్తుంది. అందుకే ఈ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సినిమా వచ్చిన ప్రతిసారీ ‘ఆ సినిమాని ఆపండి’ అనే స్లోగన్‌‌ వినిపిస్తూ ఉంటుంది. ఆమధ్య ఓ రాష్ట్రంలో సీఆర్‌‌‌‌పీఎఫ్ జవాన్లు మందుపాతరకి బలవ్వగానే ఈ టాపిక్‌‌ మరోసారి రెయిజయ్యింది. ‌