గేదెల కోసం గుజరాత్​కు వెళ్లి తిరిగిరాలే

గేదెల కోసం గుజరాత్​కు వెళ్లి తిరిగిరాలే
  • భార్యాపిల్లల ఎదురుచూపు
  • ఫిర్యాదు తీసుకోని లోకల్, ఆర్పీఎఫ్​ పోలీసులు
  • గుజరాత్​ డీఎస్పీతో ఫోన్​లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటల 

కమలాపూర్, వెలుగు: దళితబంధు గేదెల కోసం గుజరాత్​కు వెళ్లిన లబ్ధిదారుడు మిస్సయ్యాడు. ఆయనతోపాటు వెళ్లిన 8 మంది వచ్చి ఐదు రోజులవుతుండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ​మండలం ఉప్పల్ ​గ్రామానికి చెందిన సోరపాక సమ్మయ్య(50), అదే గ్రామానికి చెందిన మరో ఎనిమిది మందికి దళితబంధు పథకంలో భాగంగా డెయిరీ యూనిట్లు మంజూరయ్యాయి.

గుజరాత్ ​రాష్ట్రంలోని అహ్మదాబాద్​నుంచి గేదెలను తీసుకొచ్చేందుకు ఈ నెల 17న రైలులో వెళ్లారు. గేదెలను కొనుగోలు చేసి 24న తిరుగు ప్రయాణమయ్యారు. అహ్మదాబాద్​–- సూరత్​ మధ్య సమ్మయ్య మిస్సయ్యాడు. మిగిలిన 8 మంది లబ్ధిదారులు ట్రైన్​లో సమ్మయ్య కోసం వెతికినా ఫలితం లేకపోయింది. ఊరికి చేరుకున్న వెంటనే సమ్మయ్య గేదెలను కుటుంబసభ్యులకు అప్పగించారు. సమ్మయ్య కనిపించకుండా పోయిన విషయం తెలియజేశారు. అప్పటినుంచి సమ్మయ్య జాడ కోసం ఎదురుచూస్తూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారి పరిధి కాదని చెప్పారు. కాజీపేట​రైల్వే పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దళితబంధు పథకం గేదెల కోసం పోయిన తమ తండ్రి ఇంటికి తిరిగి రాలేదని, ఆయన ఎక్కడున్నారో కనిపెట్టి తమకు అప్పగించాలని కొడుకు హరీశ్, కూతురు అంజలి, భార్య అరుణ వేడుకుంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ఈ దిశగా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ గుజరాత్​ డీఎస్పీతో ఫోన్​లో మాట్లాడారు. సమ్మయ్య ఆచూకీ తెలుసుకుని కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఇవి కూడా చదవండి

లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

మట్టి పాత్రలో ద్రాక్షపండ్లు..ఆరు నెలల వరకు చెడిపోవు

ఊరు చిన్నదే.. ఎంజాయ్​మెంట్​కు మాత్రం తక్కువ లేదు