భారత్ బంద్ ఎఫెక్ట్...పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేత

భారత్ బంద్ ఎఫెక్ట్...పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేత

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తగా భారత్ బంద్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. 

అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క‍్రమంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. ఇవాళ జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. 

అ‍గ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో హింసాత్మక ఘటనలు జరగకుండా 20జిల్లాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులను అధికారులు నిలిపివేశారు.అంతేకాదు దాదాపు 350 రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాట్నాలోని డాక్ బంగ్లా చౌరాహా వద్ద  పోలీసులు భారీగా మోహరించారు. పంజాబ్ లో కూడా భద్రతను పెంచారు.ఢిల్లీ సమీపంలోని గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో పెద్దఎత్తున సమావేశాలను నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ప్రజలను కోరారు.

 భారత్ బంద్  నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో భద్రతను మరింత పెంచారు. హౌరాలోని హౌరా స్టేషన్, హౌరా బ్రిడ్జ్, సంత్రాగచ్చి జంక్షన్, షాలిమార్ రైల్వే స్టేషన్ భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. అటు కేరళలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని అరెస్ట్ చేస్తామని  పోలీసులు హెచ్చరించారు. 

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని పలు సంఘాలు,ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.ఈనెల 17న జరిగిన సికింద్రాబాద్ దాడి ఘటన నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ధ భద్రతను పటిష్టం చేశారు. ప్రజా సంఘాలు, ఆర్మీ అభ్యర్థులు ఎవరూ స్టేషన్ లోకి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. విధ్వంసానికి పాల్పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.