లక్షా 91 వేల జాబ్స్ నింపాలి

లక్షా 91 వేల జాబ్స్ నింపాలి
  •      రాష్ట్రంలో 39 శాతం ఉద్యోగాలు ఖాళీ: రేవంత్​​
  •     ఏడాది చివరికల్లా అన్ని పోస్టులు నింపకుంటే పోరాటమే
  •     పీకే సూచనతోనే కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనన్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలున్నాయని సీఎం కేసీఆర్ వేసిన బిశ్వాల్ కమిటీ తేల్చిందని.. ఈ ఏడాది చివరికల్లా ఆ పోస్టులన్నీ నింపాలని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి డిమాండ్​ చేశారు. గురువారం గాంధీభవన్​లో సీఎం కేసీఆర్​ చేసిన ఉద్యోగ ప్రకటనపై రేవంత్ సీనియర్ నేతలతో సమావేశమై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తన పొలిటికల్​స్ట్రాటజిస్ట్ పీకే సూచన మేరకు ఉద్యోగాలపై ప్రకటన చేసినట్లు అనుమానం ఉందన్నారు. మూడు నెలల పాటు నోటిఫికేషన్లు, దరఖాస్తుల పేరుతో జాప్యం చేసి తర్వాత ఆరు నెలల పాటు నిరుద్యోగులను ప్రిపేర్ కమ్మని చెబుతారన్నారు. నవంబర్ లేదా డిసెంబర్​లో సర్కారును రద్దు చేసి ఎన్నికలకు పోతారని తమకు సమాచారం ఉందన్నారు. దీంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ పేరుతో గ్రామాలకు దూరంగా ఉంటారనీ, తమకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పని చేయరని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన కేవలం రాజకీయ ఎత్తుగడ, ఎన్నికల వ్యూహంగా తాము భావిస్తున్నామని రేవంత్ అన్నారు.

సర్కారు ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలి

‘‘కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనకు ఆర్థిక శాఖ ఆమోదం ఉందా? వివిధ శాఖల రిక్రూట్​మెంట్లు ఆయా బోర్డుల ద్వారా జరుగుతాయి, అసలు వాటికి సమాచారం ఇచ్చారా? నోటిఫికేషన్లు, రిక్రూట్​మెంట్ విషయంలో సర్కారు సాధ్యమైనంత కాలయాపన చేసే పనిలో ఉంది” అని రేవంత్ అన్నారు. టీఎస్​పీఎస్​సీ చైర్మన్​గా ఘంటా చక్రపాణి తన ఆరేండ్ల పదవి ముగిసినపుడు గవర్నర్​కు ఇచ్చిన నివేదికలో 36 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఎన్నో అబద్ధాలు ఆడారనీ, అవన్నీ కలిపితే గిన్నిస్ రికార్డవుతుందన్నారు. 24 గంటల్లో నోటిఫికేషన్లు వస్తాయన్నారు.. కానీ ఇంత వరకు ఒక్కటి కూడా రాలేదన్నారు.

ఒక్కో నిరుద్యోగికి లక్షా 20వేలు బాకీ

2014లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా ఏడు వేల ఖాళీలున్నాయనీ, కొత్తగా మరో 50 వేల ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పారని రేవంత్ అన్నారు. ఏడాది లోపుల వాటిని నింపుతామని చెప్పి మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ప్రకటన చేసి 39 నెలలు అవుతోందనీ, రాష్ట్రంలోని 25 లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఇచ్చినా ఒక్కొక్కరికి సీఎం కేసీఆర్ లక్షా 20 వేల రూపాయలు బకాయి పడ్డారన్నారు.