కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎక్స్ఛేంజీలు కీలక ప్రకటన చేశాయి. సాధారణంగా ఆదివారం షేర్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. కానీ ఫిబ్రవరి 1న ఆదివారం అయినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆ రోజు మార్కెట్లు తెరిచి ఉంచాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్ణయించాయి.
ఫిబ్రవరి 1న ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు సాధారణ సమయాల్లోనే ట్రేడింగ్ కొనసాగుతుందని లేటెస్ట్ సర్యులర్ లో వెల్లడించాయి. బడ్జెట్ ప్రకటనల వల్ల మార్కెట్‌లో కలిగే ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకోబడిందని తెలుస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకం. ఆమె వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆమె లోక్‌సభలో ప్రవేశపెడతారు. గతంలో 2025, 2020, 2015 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ శనివారాల్లో రావడంతో మార్కెట్లను ప్రత్యేకంగా తెరిచే ఉంచారు. ఇప్పుడు 2000 సంవత్సరం తర్వాత మళ్లీ ఆదివారం బడ్జెట్ సమర్పిస్తుండటంతో.. ఇన్వెస్టర్లు తక్షణమే స్పందించేందుకు వీలుగా లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు.
బడ్జెట్ ముందస్తు అంచనాలపై ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విషయంలో మార్పులు ఉంటాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.లక్ష 25వేలకు మినహాయింపు పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ ని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే వివిధ రకాల ఆస్తుల హోల్డింగ్ పీరియడ్‌ను ఏకీకృతం చేయాలని నిపుణులు కోరుతున్నారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ ఎకనామిక్ సర్వేను విడుదల చేయనుంది. దేశ ఆర్థిక స్థితిగతులు.. కొత్త స్కీమ్స్, రాబోయే ఆర్థిక సంవత్సర లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించనుంది.
