
- ప్రతీ ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలని ప్లాన్
- లీడర్లతో పాటు కార్యకర్తలపై గురి
- తమ్మినేని కృష్ణయ్య హత్యపై బీజేపీ యాక్టివ్
- కృష్ణయ్య ఫ్యామిలీని పరామర్శించనున్న బండి సంజయ్
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకు తగిన విధంగా ఇప్పటికే కార్యాచరణ అమల్లో పెట్టింది. టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలను టార్గెట్ చేసేందుకు ఏ ఛాన్స్ వచ్చినా విడిచిపెట్టడం లేదు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నేత, పీఏసీఎస్ డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య మర్డర్ ఇష్యూలోనూ టీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నేతను పట్టపగలే కత్తులు, గొడ్డళ్లతో రాజకీయ ప్రత్యర్థులు నరికి చంపితే, టీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పందించిన తీరు పట్ల ఆ పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంటి తుడుపుగా స్టేట్ మెంట్లు ఇవ్వడం తప్పించి, ఎలాంటి నిరసనలు చేపట్టకపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్న అనుమానాలు వచ్చాయి. దీంతో ఇదే అంశంతో జనంలోకి వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెల్దారుపల్లిలో హత్యా రాజకీయాలను ఖండిస్తూనే, జిల్లాలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతల మౌనం వెనుక ఉన్న కారణాలేంటి అంటూ ప్రశ్నిస్తోంది.
10న తెల్దారుపల్లికి బండి సంజయ్..
తమ్మినేని కృష్ణయ్య మర్డర్ ఇష్యూలో ప్రధాన పార్టీల నేతల నోళ్లు మూతబడడానికి రాజకీయ అంశాలతో పాటు, మునుగోడు ఉప ఎన్నిక కూడా ఉందన్న ప్రచారంతో బీజేపీ అలర్ట్ అయింది. హత్యను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకోకపోవడం వెనక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ పై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు జనాల్లో చర్చ జరుగుతోంది. దాన్నే మరింత హైలైట్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 10న తెల్దారుపల్లి రానున్నారు. కృష్ణయ్య కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. కేవలం ఈ కార్యక్రమం కోసమే బండి సంజయ్ హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల సహాయ మంత్రి బీఎల్ వర్మ స్వయంగా కృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తుపై కృష్ణయ్య కుమారుడు, కుమార్తె అనుమానాలు వ్యక్తం చేయగా, పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని మాటిచ్చారు.
అండగా ఉంటూ..
కృష్ణయ్య హత్య జరిగిన తర్వాత పరిణామాల నేపథ్యంలో కొద్ది నెలల క్రితం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల వేధింపులతోనే తాను చనిపోతున్నానని చెబుతూ సాయి గణేశ్ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా మృతుడి అమ్మమ్మ, చెల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పడం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు ఖమ్మం వచ్చి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేయడం, ఒక ఇంటిని కొనిచ్చి అండగా నిలబడడాన్ని సామాన్యులు కూడా ప్రశంసించారు. ఈ ఘటన బీజేపీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపిందన్న అంశాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం కృష్ణయ్య హత్య జరిగిన తర్వాత టీఆర్ఎస్ ముఖ్య నేతలు ముఖం చాటేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతలు ఇదే అంశాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నారు. కరివేపాకులా వాడుకొని వదిలేసే పార్టీని వదిలిపెట్టాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల ముఖ్యనేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆయా పార్టీల్లో అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. టీఆర్ఎస్లో పదవులు లేక, ప్రాధాన్యత లేకుండా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారని, ఈ మేరకు లోపాయికారి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.