గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మరోసారి హాలీవుడ్ తెరపై తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'ది బప్ల్ '(The Bluff) . ఈ మూవీ ఈరోజు ( ఫిబ్రవరి 26న) ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సాధారణంగా సినిమాలు అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతాయి. కానీ ఈ చిత్రం నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
కథా నేపథ్యం..
19వ శతాబ్దపు కరేబియన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రియాంక 'ఎర్సెల్' అలియాస్ 'బ్లడీ మేరీ' అనే సముద్రపు దొంగల రాణి పాత్రలో నటించింది. అయితే తన గతాన్ని వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునే మేరీకి, తన పాత శత్రువు కెప్టెన్ కానర్ రూపంలో ముప్పు ఎదురవుతుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె మళ్ళీ కత్తి పట్టాల్సి వస్తుంది. ఒక తల్లిగా, ఒక యోధురాలిగా ప్రియాంక చూపించిన ఎమోషన్స్ ఈ సినిమాకు హైలైట్.
టాక్ ఎలా ఉందంటే?
సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో రివ్యూల వెల్లువ మొదలైంది. నెటిజన్లు ప్రియాంక నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రియాంక తన అద్భుతమైన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ , యాక్షన్ సీక్వెన్స్ అమోఘం అని ఒకరు కామెంట్ చేయగా, "బ్లడీ మేరీ పాత్రలో ఆమె గంభీరంగా ఉంది" అని మరొకరు రాసుకొచ్చారు.
హాలీవుడ్ స్టార్ కార్ల్ అర్బన్ , ప్రియాంక మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొందరు కథ బలహీనంగా ఉందని, కేవలం రివెంజ్ డ్రామాగా మాత్రమే మిగిలిపోయిందని పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ, టెక్నికల్ వాల్యూస్ , విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.
తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ హాలీవుడ్ చిత్రాన్ని కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్ త్రిల్లర్‌ను సొంత భాషలో ఆస్వాదించవచ్చు.
వారణాసిలో ..
ప్రియాంక చోప్రా కేవలం హాలీవుడ్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) లో కూడా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రియాంక కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఈ మూవీలో కథానాయుడు మహేష్ బాబు సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి, ప్రియాంక చోప్రా అభిమానులకు 'ది బ్లఫ్' ఒక మంచి వీకెండ్ వాచ్ అంటున్నారు సినీ ప్రియులు.
