ఈత కొడుతూ బీఎస్పీ నేతల నిరసన

ఈత కొడుతూ బీఎస్పీ నేతల నిరసన

వికారాబాద్: అండర్ గ్రౌండ్  బ్రిడ్జి నిర్మాణంలో లోపాలున్నాయంటూ  బీఎస్పీ నేతలు వినూత్నంగా నిరసనకు దిగారు. వరద నీరు చేరి స్విమ్మింగ్ పూల్లా మారిన బ్రిడ్జి వద్ద ఈత కొడుతూ ఆందోళన చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ – మొరంగం పల్లి రైల్వే గేట్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రభుత్వం  అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టింది. అయితే బ్రిడ్జి డిజైన్ లోపం వల్ల బ్రిడ్జి కిందికి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంఛార్జ్ పెద్ది అంజన్న ఆధ్వర్యంలో బీఎస్పీ కార్యకర్తలు బ్రిడ్జి వద్ద నిరసనకు దిగారు. స్విమ్మింగ్ పూల్లా మారిన బ్రిడ్జిలోకి దూకి ఈతకొట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.  

ఈ సందర్భంగా బీఎస్పీ నేత పెద్ది అంజన్న మాట్లాడుతూ... ఎలాంటి ప్రణాళిక లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజా ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ టు ముంబై హైవేకు లింకు కలిగిన మోమిన్ పేట్ తాండూర్ రోడ్డు ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. తూతూ మంత్రంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. దీంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  బ్రిడ్జి నిర్మాణానికి శాశ్వత పరిష్కారం చూపకపోతే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.