
హైదరాబాద్ , వెలుగు: నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్ . ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘నిరుద్యోగ భృతి’ హామీ ఇప్పట్లో అమలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు తాజా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే నిదర్శనం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి రూ. 1810 కోట్లు కేటాయించారు. ఫుల్ బడ్జెట్లో మాత్రం దాని ప్రస్తావనే తేలేదు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3016 ఇస్తామని గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేర్లు నమోదు చేసుకున్న వాళ్లే సుమారు 29 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంత మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే రాష్ట్ర ఖజానాపై తీవ్రంగా ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నందున, ఇప్పటికే నిధులు కొరత ఉన్నందున వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. గైడ్ లైన్స్ ఖరారు చేస్తే 14 లక్షల మందికైనా భృతి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. వీరికి రూ.3016 ఇవ్వాలంటే నెలకు రూ.422 కోట్లు.. అంటే ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇంత వ్యయం భరించలేకనే నిధులు కేటాయించనట్లు సమాచారం.