డాక్టర్లు డ్యూటీకి సక్రమంగా హాజరుకావాలి : సత్యశారద

డాక్టర్లు డ్యూటీకి సక్రమంగా హాజరుకావాలి : సత్యశారద
  • డ్యూటీకి రాని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
  • రెవెన్యూ సదస్సు, వేసవి శిక్షణ శిబిరాలను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద 

వర్దన్నపేట, వెలుగు: వరంగల్​ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను  కలెక్టర్ సత్యశారద మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, నర్సుల అటెండెన్స్ రిజిస్టర్‌‌ను పరిశీలించారు.  డ్యూటీలో ఉండాల్సిన15 మంది డాక్టర్లు లేకపోవడంతో వారికి షోకాజ్​నోటీసులు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. డాక్టర్లు సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళవారం వర్ధన్నపేట  మండలంలోని ఉప్పరపల్లి, దివిటిపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు.   రైతులతో మాట్లాడి వారి సమస్యలను గురించి తెలుసుకున్నారు. 

 భూ సమస్యలు పరిష్కరించి, వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తోందని తెలిపారు.  కాట్రియాల జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలతో పాటు వర్దన్నపేట ప్రభుత్వ పాఠశాలలో  జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలని స్టూడెంట్స్‌కు  సూచించారు. దమ్మన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు కేంద్రాల నిర్వహణ,  సిబ్బంది పనితీరు ధాన్యం నాణ్యతా  రైతుల అవసరాలు, డబ్బుల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించారు.  వర్ధన్నపేట, ఉప్పరపల్లి, రామవరం గ్రామాల్లో  క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థితిగతులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, డబ్ల్యూ ఎస్ డీ ఈ శ్రీనివాస్, తహసీల్దార్​ విజయసాగర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.