మునగ సాగుతో ఎక్కువ లాభం పొందొచ్చు : కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ 

మునగ సాగుతో ఎక్కువ లాభం పొందొచ్చు : కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ 
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ 
  • వ్యవసాయ కళాశాల సందర్శన 

అశ్వారావుపేట, వెలుగు: మునగ సాగు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్​వి పాటిల్ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులు సాగు చేస్తున్న వివిధ పంటలను డీన్ హేమంత్ కుమార్ తో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. స్టూడెంట్స్ సాగు చేస్తున్న మునగ, మామిడి తోటల్లో కి వెళ్లి పరిశీలించారు. కళాశాల ఆవరణంలో ఇంకుడు గుంతలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 500 ఎకరాలలో మునగ సాగు అవుతోందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మునగా ఎగుమతి చేసే స్థాయికి రైతులు మునగ పంట సాగు చేసుకోవాలని సూచించారు. మునగ  ఆకులకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉందన్నారు. అశ్వారావుపేట, కన్నాయిగూడెం పరిధిలో సర్వే నెంబర్ 911,152కు సంబంధించిన అటవీ, రెవెన్యూ శాఖల జాయింట్ సర్వే పూర్తయిందని, అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులందరికీ భూభారతి చట్టం ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తామని చెప్పారు.

అనంతరం గోగులపూడిలో వెదురు బొమ్మలు తయారు చేస్తున్న కళాకారులను కలిశారు.  వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించి అక్కడ ఐటీడీఏ ద్వారా నిర్మించిన దుకాణాల సముదాయాలను పరిశీలించారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డీటీ రామకృష్ణ ఉన్నారు. 

ఇంకుడు గుంతలు నిర్మించాలి

ములకలపల్లి : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టాలని కలెక్టర్ జితేశ్​సూచించారు. ములకలపల్లి లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మొక్కను నాటారు. మంగపేట పీహెచ్​సీ ఎదుట మట్టి ఇటుకలతో నిర్మించే ప్రహరీని పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ విద్యా చందన్, డీఎంహెచ్​వో భాస్కర్ నాయక్, ఎన్ సీడీ మధువరన్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సైదులు, ఎంపీడీవో రేవతి ఉన్నారు.