మంత్రి కేటీఆర్​ వస్తేనే బస్​ డిపో ఓపెనింగ్​ చేస్తరట..కుదరని ముహూర్తం

మంత్రి కేటీఆర్​ వస్తేనే బస్​ డిపో ఓపెనింగ్​ చేస్తరట..కుదరని ముహూర్తం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు ఆర్టీసీ బస్​డిపో ప్రారంభోత్సవానికి ముహూర్థం కుదరడం లేదు. సుమారు రూ.3.75కోట్లతో నిర్మించిన ఇల్లెందు ఆర్టీసీ డిపో ప్రారంభానికి నోచుకోవడం లేదు. అందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్​సమయం ఇవ్వకపోవడమే కారణం. డిపో నిర్మించినందుకు సంబరపడాలో, ప్రారంభించలేకపోతున్నందుకు సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి.

రెండేళ్లకు పైగా నత్తనడకన సాగిన డిపో నిర్మాణం ఈ ఏడాది జనవరిలో పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి10న ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్​ఓపెనింగ్​చేస్తారని చెప్పారు. మంత్రి పర్యటన వాయిదా పడడంతో ఓపెనింగ్​జరగలేదు. సుమారు నాలుగు నెలలకుపైగా కేటీఆర్ రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 

2021లో శంకుస్థాపన..

దాదాపు130 ఏండ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఇల్లెందు పట్టణంలో 2021 ఫిబ్రవరి 21న ఆర్టీసీ శాటిలైట్​ బస్ డిపో నిర్మాణానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో డిపోకు 25కు పైగా బస్సులను కేటాయించే అవకాశం ఉందని ఆర్టీసీ ఆఫీసర్లు తెలిపారు. మొదట శాంక్షన్​చేసిన నిధులు సరిపోక డిపో పరిసరాలు, బస్టాండ్ ప్లాట్ ఫాంల అభివృద్ధి కోసం ఇటీవలే మరో రూ.1.50కోట్లను కలెక్టర్​కేటాయించారు. నియోజకవర్గ కేంద్రమైన ఇల్లెందు చుట్టూ గ్రామీణ ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందులో 1974లో అప్పటి ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్​ను నిర్మించింది. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం దాదాపు 200 నుంచి 250 ట్రిప్పుల బస్సులు నడిచేవి. 

కేటీఆర్ టైమివ్వడమే తరువాయి...

గతంలో ఇల్లెందుకు మంజూరైన బస్​డిపో మహబూబాబాద్​కు తరలిపోయింది. మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, కోరం కనకయ్య డిపో ఏర్పాటు కోసం కృషి చేశారు. వారితోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే కృషితో ఇల్లెందులో డిపో నిర్మాణానికి రెండేండ్ల కింద పునాదిరాయి పడింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు సంబురపడ్డారు. 2021 ఫిబ్రవరిలో శంకుస్థాపన టైంలో అదే ఏడాది దసరా నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆఫీసర్లు ప్లాన్​చేయాలని మంత్రి సూచించారు. ఉన్నతాధికారులు 2022 దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్​నిర్లక్ష్యంతో నిర్మాణం లేట్​ అయ్యింది.

కలెక్టర్​అనుదీప్ ఫైర్​కావడంతో పనుల్లో వేగం పెరిగింది. మొత్తం మీద ఈ ఏడాది జనవరిలో డిపో నిర్మాణం పూర్తి చేసుకుంది. చిన్న చిన్న పనులు పెండింగ్​లో ఉన్నా ఈ ఏడాది ఫిబ్రవరి10న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మంత్రి కేటీఆర్​వస్తున్నారంటూ పనులను హడావుడిగా చేశారు. పట్టణాన్ని ముస్తాబు చేశారు. చివరి క్షణంలో కేటీఆర్ పర్యటన రద్దైంది. త్వరలోనే వస్తారని చెప్పినా మూడు నెలలు గడిచిపోయాయి. అయినా కేటీఆర్​కు తీరిక దొరకడంలేదు. దీంతో బస్ డిపో ప్రారంభోత్సవం వాయిదా పడుతోంది. కేటీఆర్​ఎప్పుడు టైం ఇస్తారా అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

పెరగనున్న బస్సు రూట్లు...

ఇల్లెందులో డిపో లేక హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లాలంటే ఖమ్మం, కొత్తగూడెం మీదుగా పోవాల్సిందె. మారుమూల ప్రాంతాలకు బస్సులు సక్రమంగా నడవని దుస్థితి. ఆటోలే దిక్కవుతున్నాయి. డిపో ఏర్పాటుతో గుండాల, ఆళ్లపల్లి, బోడు వంటి ప్రాంతాలకు సర్వీస్​లు పెరిగే అవకాశం ఉంది. చీమలపాడు, కారేపల్లి, చెట్టుపల్లి వయా గుండాల, పాకాల వయా నర్సంపేట వంటి ప్రాంతాలకు బస్సు నడిపే అవకాశం ఉంది. హైదరాబాద్​కు ప్రస్తుతం రెండు బస్సులే ఉన్నాయి.

ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక కొత్తగూడెం, ఖమ్మం వెళ్లి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్తుంటారు. లేదంటే మహబూబాబాద్​కు వెళ్లి ట్రైన్​లో వెళ్తుంటారు. వరంగల్, గోదావరిఖని, కరీంనగర్, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ రూట్లలో బస్సులు పెరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లోనైనా ఇల్లెందు బస్​డిపో ప్రారంభం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.