టైంకు బస్సు రావట్లే.. వచ్చిన దాంట్లో కిక్కిరిసి..!

టైంకు బస్సు రావట్లే.. వచ్చిన దాంట్లో కిక్కిరిసి..!
  • ఆర్టీసీ బస్సులను తగ్గించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇబ్బందులు మరింత పెరిగాయి. సరిపడా బస్టాపులు లేక ఇప్పటికే జనం రోడ్లమీద అవస్థ పడుతున్నారు. బస్సు జర్నీని సౌకర్యవంతం చేయాల్సిన ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులను తగ్గించి టికెట్ల రేట్లు పెంచారు. పెరిగిన డీజిల్ ధరలు, లాక్​డౌన్ టైంలోని నష్టాల నుంచి బయటపడేందుకు వివిధ రకాల పన్నులను టికెట్ల రేట్లకు జతచేశారు. టైంకు రాని బస్సులు, వచ్చిన బస్సులో కిక్కిరిసి జర్నీ, పెరిగిన టికెట్ల రేట్లతో జనం విసిగిపోతున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా టికెట్ల రేట్లు ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. ఇన్​టైంలో పనులకు, ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లాలని తప్పక ఫుట్​బోర్డులపై వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. 
అరగంట నుంచి గంట 
గ్రేటర్​పరిధిలో 29 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 2019 ఆర్టీసీ సమ్మెకు ముందు సిటీ వ్యాప్తంగా 3,700 బస్సులు నడిచేవి. తర్వాత లాభాలు రావడం లేదని, స్క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సులు ఉన్నాయని వెయ్యి సర్వీసులను తగ్గించారు. కొవిడ్​టైంలో బస్సులు నడవక తీవ్ర నష్టాలు ఎదురవడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఆఫర్లు ప్యాకేజీలను ప్రకటించారు. ఈ క్రమంలో లాభాలు రాని రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించాలని ప్లాన్​చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా తగ్గిస్తున్నారు. ఒక్కో డిపో నుంచి15 నుంచి 30 బస్సులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం 2,700 బస్సులకు గాను 1700 నుంచి 1800 బస్సులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు 10 నిమిషాలు, పావుగంట వ్యవధిలోనే వచ్చే బస్సులు ఇప్పుడు అరగంట నుంచి గంట వ్యవధిలో వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం స్టాపుల్లో పడిగాపులు కాస్తున్నామని చెబుతున్నారు.
అదనపు భారం
లాక్​డౌన్​నష్టాలు, డీజిల్ రేట్ల సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ భద్రతా పన్ను, డీజిల్ సెస్, రౌండప్ వంటి చార్జీల పేరుతో టికెట్ రేట్లను పెంచింది. గతంలో రోడ్డు భద్రత– ప్రమాద బీమాను సంస్థే భరించేది. కానీ ప్రస్తుతం ప్రయాణికుల నుంచే వసూలు చేస్తోంది. వీటికి డీజిల్ సెస్ ని కూడా కలిపింది. డైలీ గ్రేటర్​వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. వీళ్లలో నాలుగు లక్షల మంది దాకా మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలకు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలకు ప్రయాణిస్తున్నారు. ఒక స్టాపు, రెండో స్టాపుల్లో దిగే ప్రయాణికులకు గతంలోని టికెట్ చార్జీలే కంటిన్యూ అవుతున్నాయి. అంతకు మించి ప్రయాణించేవారి నుంచి ఆర్టీసీ 5 రూపాయలు వసూలు చేస్తోంది. గతంలో ఐదో స్టేజీ వరకు రూ.15 తీసుకోగా ప్రస్తుతం అది రూ.20 అయ్యింది. ఆరో స్టేజ్ నుంచి తొమ్మిదో స్టేజ్ వరకు మరో రూ.5 తీసుకుంటోంది. మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ఇలాగే కిలోమీటర్ల లెక్కన టికెట్ల రేట్లు పెరిగాయి. 
ఇంకోటి ఎప్పుడొస్తుందో..
మాది బొల్లారం. నేను సెక్రటేరియట్ ఏరియాకి పనిమీద వస్తూ.. పోతుంటాను. ఇదివరకు బస్సులు మంచిగానే వచ్చేవి. కానీ ఇప్పుడు ఎంతసేపు చూసినా రావట్లేదు. దీంతో బస్సుల్లో రష్ పెరుగుతోంది. మళ్లీ ఇంకోటి ఎప్పుడొస్తుందో తెలియక వచ్చిన బస్సులోనే ఎగబడి ఎక్కేస్తున్నారు. ఆర్టీసీ బస్సు జర్నీ చాలా కష్టమవుతుంది. 
 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                                                                                                                                                                                                                        - రోహిత్, ప్రయాణికుడు
నిల్చోడానికి కూడా ఖాళీ ఉండట్లే
చార్జీ తక్కువని డైలీ ఆర్టీసీ బస్సులోనే వెళ్తాను. సీట్లు ఉంటే కూర్చోవడం లేదంటే నిల్చుని వెళ్లడం అలవాటైపోయింది. కానీ ఈ మధ్య రష్  ఎక్కువగా ఉంటోంది. నిల్చోడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. పనికి లేటైతదని బస్సు రాగానే ఎక్కేస్తున్నాం. కానీ దిగే స్టాప్ వచ్చేవరకు నరకం చూస్తున్నాం. మండే ఎండలు, ఉక్కపోత మధ్య కిక్కిరిసి ప్రయాణించడం కష్టంగా ఉంటోంది. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
                                                                                                                                                                                                              - హరికృష్ణ, ప్రయాణికుడు
‘‘ఒకప్పుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బస్టాప్​లో నిల్చుంటే బస్సులు వెంటవెంటనే వచ్చేవి. ఒకటి వెళ్లిపోయినా మరొక దాంట్లో వెళ్లొచ్చులే అనుకునేవాళ్లం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. డైలీ సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. బస్సు రాగానే నెట్టుకుంటూ ఎక్కుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే ఎక్కాల్సిన ముందు వైపు నుంచి మగవాళ్లు ఎక్కి మమ్మల్ని తోసేస్తున్నారు. 4 రోజుల కింద సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో 47ఎల్ బస్సు కోసం 20 నిమిషాల వెయిట్​చేశాను. రాగానే ఎక్కుదామని వెళ్లగా తోపులాటలో కిందపడ్డాను. చార్జీలు కూడా భారీగా పెంచారు.’’అని ప్యాసింజర్​ అపూర్వ తెలిపారు.