హుజూర్ నగర్​లో టైట్​ ఫైట్

హుజూర్ నగర్​లో టైట్​ ఫైట్
  • నేటితో ప్రచారం బంద్..ఎల్లుండి పోలింగ్​
  • ఆర్టీసీ సమ్మెతో టీఆర్ఎస్కు షాక్
  • నేతల ఎంట్రీతో కాంగ్రెస్లో జోష్
  • గల్లీ గల్లీకి చేరిన బీజేపీ క్యాంపెయిన్

సూర్యాపేట, వెలుగుహుజూర్​నగర్​ కాంగ్రెస్​ సిట్టింగ్​ సీటు కావటంతో ముందునుంచీ  ప్రచారం హోరెత్తించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీలో ఉండటం, రాష్ట్ర కాంగ్రెస్​ ముఖ్యులందరూ ప్రచారానికి దిగటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ కనబడింది. సీఎం కేసీఆర్​ సభ రద్దు కావటంతో రెండు రోజులుగా టీఆర్ఎస్ డీలా పడింది. తమ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించేందుకు టీఆర్ఎస్​ పార్టీ ఇతర జిల్లాల నుంచి వేలాది మందిని మోహరించింది. మరోవైపు రాష్ట్రంలో బలం పుంజుకున్న బీజేపీ ఇక్కడ నిలకడగా ప్రచారం కొనసాగించింది. టీడీపీ అభ్యర్థి పోటీలో ఉండటం, స్వతంత్ర్య అభ్యర్థులు కూడా బరిలో ఉండటంతో ప్రధాన అభ్యర్థుల ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ  అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాయి.

ఇప్పటివరకు బోణి కొట్టకపోవటంతో.. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్​ ప్రచారాస్త్రం ప్రయోగించింది.  ఇంతకాలం పట్టించుకోని టీఆర్ఎస్​ ఇప్పుడేం చేస్తుంది.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండని కాంగ్రెస్​ ప్రచారం సాగించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, సీఎం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు బీజేపీ ప్రాధాన్యమిచ్చింది.

జనరల్​ ఎలక్షన్​ తలపించిన బై ఎలక్షన్​

ప్రధాన పార్టీల ప్రచార హోరుతో.. ఈ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికను తలపించింది. ఎన్నికల ఖర్చు మితిమీరిందని, అధికార దుర్వినియోగం జరిగే ఆస్కారముందనే ఫిర్యాదులతో  కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇక్కడ పోటీ తీవ్రతకు అద్దం పట్టింది. సూర్యాపేట జిల్లా ఎస్పీసి బదిలీ చేయటంతో పాటు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిని రంగంలోకి దింపటం అధికార పార్టీని ఇరుకున పడేసింది. పదిహేను రోజులుగా భారీ కాన్వాయ్​లు, లీడర్ల హడావుడితో నియోజకవర్గమంతా బిజీబిజీగా మారింది.  కులాలు, మతాలవారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు దాదాపు 4500 మంది లీడర్లను ఇతర జిల్లాల నుంచి  ఇక్కడ దింపింది. గ్రామాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించింది.  గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కలిసొస్తుందని, దీనికితోడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తనను గెలిపిస్తాయని టీఆర్​ఎస్​ అభ్యర్థి సైదిరెడ్డి భావిస్తున్నారు. కానీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనలు, ప్రభుత్వం పట్టువీడకుండా మొండిగా వ్యవహరిస్తున్న తీరు నెగెటివ్​గా మారిందని ఆ పార్టీ నేతలే  ఆందోళనలో ఉన్నారు.

నిలకడగా అడుగులేసిన బీజేపీ

అభ్యర్థి ఎంపిక ఆలస్యమైనప్పటికీ.. బీజేపీ జోరుగా ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. పార్టీ అభ్యర్థి కోట రామారావు తరఫున బీజేపీ నేతలు మండలాల వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని ఓటుబ్యాంకుపై దృష్టి పెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తన ప్రచారంతో కేడర్​లో ఉత్సాహం నింపారు. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి దూకుడుగా  ప్రచారం చేశారు. చివరి రోజైన శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానుండటంతో బీజేపీలో జోష్​ నెలకొంది.