రోడ్డును చేత్తో తవ్వేస్తున్నారు

రోడ్డును చేత్తో తవ్వేస్తున్నారు

భవనాలు శిథిలావస్థకు చేరుకుంటే..పెచ్చులు..పెచ్చులుగా ఊడిపోవడం చూసి ఉంటాం. కానీ కొత్తగా వేసిన రోడ్డును ప్రజలు చేతులతో పెకిలిస్తున్నారు. ఎలాంటి ఆయుధం లేకుండానే కంకర రాళ్లను తొలగిస్తున్నారు. ఏంటీ నమ్మడం లేదా? కాంట్రాక్టర్ల మాయాజాలం మాములుగా లేదు మరి అక్కడ. అందుకే ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా అవాక్కు అవాల్సిందే. మరీ ఇంత అధ్వానంగా రోడ్డు నిర్మాణం ఉంటుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.  

కొత్త రోడ్డు..పదిరోజులకే పాడైపోయింది

కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల కాసుల కక్కుర్తి అక్కడి గ్రామ ప్రజలకు శాపంగా మారింది. కొత్తగా రోడ్డు వేసి పట్టుమని పది రోజులు కూడా కాకముందే అధ్వానంగా తయారైంది. అడిగేవారు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు అడిందే ఆట పాడిందే పాటగా మారింది. అందుకే నాసిరకం రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. అటుగా ఆ రోడ్డుపై  వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానిక ప్రజలు. కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని ఓ గ్రామంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై అధ్వాన్నంగా రోడ్డును వేశారు. పైకి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారి చేతులతోపెకిలిస్తేనే తెలుస్తుంది ఎంత అధ్వానంగా రోడ్డును వేశారో. ఇక దానిపై నడుస్తుంటేనే  కంకర రాళ్లు పైకి తేలుతున్నాయంటున్నారు స్థానికులు. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. దీంతో గ్రామస్థులు రోడ్డును చేతితో పెకిలించి వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు..ఎంత నాసిరకంగా రోడ్డు నిర్మాణం జరిగిందో. లక్షలకు లక్షలు బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచేస్తున్న కాంట్రాక్టర్లు..రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆ రోడ్డుపై ప్రయాణం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. బైక్స్, సైకిళ్ల మీద వెళ్లితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.

ఈ రోడ్డుపై జర్నీ చేయలేము

నాసిరకం రోడ్డు వేస్తున్నారని అధికారులకు తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మనీ మత్తులో జోగుతుండటంతో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు ఇష్టమొచ్చినట్లు రోడ్డు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగితే  ఎదురు దాడికి దిగేందుకు కూడా వెనుకాడ లేదని చెబుతున్నారు. అందుకే వారిని ప్రశ్నించేందుకు ఎవరూ సాహసం చేయాలేకపోయామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని చెబుతున్నారు. కొత్త రోడ్డుపై కంకర తేలి ఉంటే తాము ఎలా ప్రయాణం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఒక్కరు కూడా ఎందుకు నోరు మొదపటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఆఫీసర్లకు ముందే తెలుసని..అంతా అనుకునే రోడ్డు నాసిరకంగా వేశారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్డును మళ్లీ మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

పూణెలో ఫూల్ డే స్కూల్స్

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు