విహార యాత్రకు వెళ్లగా లోయలో పడిన కారు

విహార యాత్రకు వెళ్లగా లోయలో పడిన కారు
  •     అమరావతి జిల్లా చిక్కల్దరి ఘాట్ రోడ్డుపై ప్రమాదం
  •     మరో నలుగురికి గాయాలు

ఆదిలాబాద్, వెలుగు : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చిక్కల్దరి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణవాసులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్, బేల, బీంపూర్ మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, మరికొంతమంది యువకులు కలిసి శనివారం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చిక్కల్దరి హిల్ స్టేషన్ కు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చిక్కల్దరి ఘాట్ రోడ్డు లోయలో పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారు 200 మీటర్ల లోతులో పడిపోవడంతో నుజ్జునుజ్జయ్యింది. చనిపోయిన వారిలో భీంపూర్ మండలంలోని అర్లి టి సర్పంచ్ రమ, లస్మన్న ఒక్కగానొక్క కొడుకు వైభవ్ (29), నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కొరిటికల్ కు చెందిన అద్దంకి శివకృష్ణ (31), తిప్పర్తి మండలంలో పల్లెపల్లివారిగూడానికి  చెందిన వనపర్తి కోటేశ్వర్ రావు (27), అర్లి టికి చెందిన కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (31) ఉన్నారు. శివకృష్ణ కప్పర్లలో, కోటేశ్వర్ రావు భీంపూర్ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్లుగా పనిచేస్తున్నారు. గాయపడి వారిలో ఖమ్మం జిల్లా పొన్నెకల్ కు చెందిన శ్యాంసుందర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుమన్, నల్గొండ జిల్లా కేటపల్లి మండలంలోని చీకటిగూడానికి చెందిన ముత్తినేని హరీశ్, మిర్యాలగూడకు చెం దిన యోగేశ్ యాదవ్ ఉన్నారు. వీరంతా అర్లి టి, పెండ్ల్వాడర్ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్నారు.   

ఓవర్​టేక్​ చేయబోయి భార్యాభర్తలు

కల్వకుర్తి : టూ వీలర్​పై వెళ్తూ ఓవర్  టేక్ చేయగా లారీని ఢీకొట్టి భార్యాభర్తలు చనిపోయారు. పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్ పల్లికి చెందిన నాగయ్య (50), పార్వతమ్మ(45) భార్యాభర్తలు. ఆదివా రం నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలోని సంతకు టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చి వెళ్తున్నారు. మార్చాల సమీపంలో ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీనీ ఢీకొట్టారు. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులకు ఇద్దరు కొడుకులున్నారు.  

పంచాయతీ సెక్రటరీ..  

చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని మర్లవాడ సమీపంలో టిప్పర్.. బైక్​ను ఢీకొట్టడంతో గంగాధర మండలం కాశిరెడ్డిపల్లిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న అర్నకొండకు చెందిన మీర్జ రవీందర్(53) అక్కడికక్కడే చనిపోయాడు. జాతీయ సమైక్యత దినోత్సవంలో భాగంగా ఆదివారం కాశిరెడ్డిపల్లెలో జరిగిన వేడుకలో రవీందర్ ​పాల్గొన్నాడు. తర్వాత టూవీలర్​పై వెళ్తూ బంకులో పెట్రోల్ పోసుకున్నాడు. తర్వాత ఇంటికి పోతుండగా ధర్మారం నుంచి కరీంనగర్ వెళ్తున్న టిప్పర్ డ్రైవర్​ఓవర్​స్పీడ్​తో వచ్చి వెనుక నుంచి బైక్​ను ఢీకొట్టాడు. దీంతో రవీందర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.