సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

సికింద్రాబాద్ రూబీ హోటల్ ప్రమాదానికి ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలడమే కారణమని గుర్తించారు. బిల్డింగ్, హోటల్ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ అధికారులు తేల్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో బ్యాటరీ పేలి.. ఫస్ట్ ఫ్లోర్ కు మంటలు వ్యాపించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. సెల్లార్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో ప్రమాదం దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. సీసీ టీవీ రికార్డు ప్రకారం సోమవారం రాత్రి 9గంటల 17 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

నివేదికలో కీలక విషయాలు
సికింద్రాబాద్ రూబీ హోటల్ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఫైర్ డిపార్ట్ మెంట్ మూడు పేజీల నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. భవన యజమాని, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. మొదట సెల్లార్ లోనే అగ్నిప్రమాదం జరిగిందని, ఆ తర్వాత మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని నివేదికలో పేర్కొన్నారు. లిథియం బ్యాటరీ పేలుళ్లతో దట్టమైన పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏ మాత్రం పాటించలేదని, భవనానికి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉన్నాయని తెలిపింది. లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన పట్టించుకోలేదని స్పష్టం చేసింది. 

అసలేం జరిగింది..?


సోమవారం రాత్రి రూబీ హోటల్ లో దట్టమైన పొగలు, మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే కొందరు స్పాట్ లోనే చనిపోయారు. రూబీ హోటల్ లో మొత్తం 28 రూములు ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో హోటల్ లో 25 మంది ఉన్నారు. వీరంతా ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ(విశాఖ) వాసులుగా గుర్తించారు. కొంతమంది రూబీ హోటల్ లో టెర్రస్ నుంచి పక్కనున్న యాత్రి హోటల్ ద్వారా బయటపడ్డారు. ప్రమాదంలో 8 మంది చనిపోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారికి యశోద, అపోలో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన 8 మందిలో ఆరుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించి.. పోస్ట్ మార్టం పూర్తి చేసి.. కుటుంబసభ్యులకు అప్పగించారు. మరో ఇద్దరి మృతదేహాలు సికింద్రాబాద్ గాంధీ మార్చురీలో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి.  

హోటల్ యజమానిపై కేసులు


అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న మన్మోహన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హోటల్ మేనేజ్ మెంట్ పై 304(2), 324 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ షోరూమ్ యజమాని రంజిత్ సింగ్ బగ్గను అదుపులోకి తీసుకుని.. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.