
న్యూఢిల్లీ: లోక్‌సభలో మంగళవారం ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చ సందర్భంగా డ్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ కనిమొళి కరుణానిధి మాట్లాడారు. దేశానికి భద్రత కల్పించడంలో కేంద్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పహల్గాం ఉగ్రదాడి జరగటం, దేశ ప్రతినిధుల బృందాన్ని విదేశాలకు పంపాల్సి రావటం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తున్నయని తెలిపారు.
" ఫస్ట్ టైం ప్రతిపక్షంపై బీజేపీ కొంత నమ్మకం చూపింది. మమ్మల్ని విదేశాలకు పంపే బృందంలో భాగం చేసింది. అందుకు మేం కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతాం. కానీ, ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉంటే మేం మరింత సంతోషించేవాళ్లం. దాడి గురించి రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్), ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ముందస్తు హెచ్చరికలను జారీ చేశాయి. అయినా, ఎందుకు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు? " అని ఆమె ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడి విషయంలో ప్రధానమంత్రి బాధితుల కుటుంబాలకు ఇప్పటిదాకా క్షమాపణ అయినా చెప్పారా? అని నిలదీశారు. కనీసం పశ్చాత్తాప పడుతున్నట్లు కూడా ఆయన చెప్పలేదని ఆరోపించారు. ఉగ్రదాడి విషయంలో ప్రతిపక్షాలన్ని సాయుధ బలగాలకు, కేంద్రప్రభుత్వానికి అండగా నిలబడ్డాయని గుర్తుచేశారు. అప్పుడు ఎవరూ తమ మతాన్ని చూడలేదని.. కానీ బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలలో మునిగిపోతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై ఏ చర్య తీసుకున్నారని కేంద్రాన్ని కనిమొళి నిలదీశారు.