
- రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుమతి తీసుకోలేదు
- పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: జాతీయ హోదా పొందడానికి అవసరమైన అర్హత కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని, అందుకే జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. గురువారం లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణ – ఏపీ మధ్య జలవివాదాలు, కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్ల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. జాతీయ హోదా కోసం ఏర్పాటు చేసిన హైపవర్ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని, కేంద్రం అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా ఆయా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తుందని వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 2016, 2018లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, అయితే.. పెట్టుబడుల అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోవడంతో జాతీయ హోదా దక్కలేదని స్పష్టం చేశారు.
బోర్డుల ఆధీనంలోకి ప్రాజెక్టులు రాలేవు
విభజన చట్టంలోని సెక్షన్ 87 సబ్ సెక్షన్ 1లోని అధికారాలను ఉపయోగించి జలశక్తి శాఖ నిరుడు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని బిశ్వేశ్వర్ చెప్పారు. పర్మిషన్ లేని ప్రాజెక్టులకు ఏడాదిలోగా అన్ని అనుమతులు తీసుకోవాలని గడువిచ్చామన్నారు. పర్మిషన్ లేని ప్రాజెక్టుల అనుమతుల కోసం ఆయా రాష్ట్రాలు ఇచ్చే సమాచారాన్ని బట్టే సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్లు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పర్మిషన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తాయన్నారు. తెలంగాణ, ఏపీలోని కృష్ణా, గోదావరి నదులు, వాటిపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ బాధ్యతలను రెండు రివర్ బోర్డులు చూస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలే ప్రాజెక్టుల ప్లానింగ్, డిజైన్ ఇతర బాధ్యతలు చూస్తున్నాయని, కేంద్రం వాటికి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు అర్హతలను బట్టి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందజేస్తుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై గల తమ కంపోనెంట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చిందని, కానీ, తెలంగాణ కూడా ప్రాజెక్టులు ఇస్తేనే తమవి స్వాధీనం చేసుకోవాలని ఏపీ మెలిక పెట్టిందన్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం కంపోనెంట్లను బోర్డు నిర్వహణకు ఇవ్వలేదని, దీంతో రెండు రాష్ట్రాల్లోని ఏ ప్రాజెక్టును కూడా కృష్ణా బోర్డు ఆధీనంలోకి తీసుకోలేదని చెప్పారు. గోదావరి బోర్డుకు ఏ రాష్ట్రమూ ఒక్క ప్రాజెక్టు కూడా అప్పగించలేదని అన్నారు.