కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తున్నది.. కార్పొరేట్ల కోసమే ఆపరేషన్ కగార్: జాన్ వెస్లీ

కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తున్నది.. కార్పొరేట్ల కోసమే ఆపరేషన్ కగార్: జాన్ వెస్లీ

హైదరాబాద్, వెలుగు: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ న్నారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే అవకాశం లేకుండా లేబర్‌‌ కోడ్‌‌ చట్టాన్ని తెస్తున్నదని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌‌లో మేడే వేడుకలను నిర్వహించారు.  

అరుణపతాకాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.." కేంద్రం నిర్వహించబోయే కులగణనకు నిర్ధిష్ట కాలపరిమితి విధించాలి. కేంద్ర ప్రభుత్వం శ్రామికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నది. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నది. రైతాంగం కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తే భూమి నుంచి వారిని దూరం చేసి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్నది. 

ఈనెల 20న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతిస్తున్నం.ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహిస్తాం. మేడే స్ఫూర్తితో శ్రామికవర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం"అని జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టినట్లు విమర్శించారు. మావోయిస్టులతో శాంతి చర్చలను జరిపి, ఆపరేషన్‌‌ కగార్‌‌ను ఆపాలని డిమాండ్‌‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌‌ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్‌‌, బండారు రవికుమార్‌‌ తదితరులు 
పాల్గొన్నారు.