దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల ..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల ..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే క్రమంలో కేరళలో ఓ మరణం కూడా చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతుందడం మళ్లీ సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. కేరళలో కొత్త సబ్‌ వేరియంట్‌ బయటపడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రానున్న పండగల సీజన్‌లో వైరస్‌ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి.. వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది.

కరోనా వైరస్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు ఈ మధ్యే కేరళలో వెలుగు చూశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. భారత్‌ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. 

ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తాజా అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

భారత్ లో ఇవాళ్టికి యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1828కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 ఇటీవల బయటపడిన కేరళలో ఓ మరణం నమోదైంది. కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. దీంతో జాతీయ స్ధాయిలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు, కోవిడ్ 19 కారణంగా భారత్ లో 5,33,317 మంది మరణించారు. అయితే మరణాల రేటు మాత్రం 1.19 శాతంగా ఉంది.