చెరుకు క్వింటాల్​కు.. ఎఫ్ఆర్​పీ రూ.315

చెరుకు క్వింటాల్​కు.. ఎఫ్ఆర్​పీ రూ.315
  • షుగర్ కేన్ ‘మద్దతు ధర’ను క్వింటాల్ కు రూ. 10 పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చెరుకు రైతులకు తీపివార్త చెప్పింది. చెరుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్​పీ)ను క్వింటాల్​కు రూ.315కు పెంచినట్లు ప్రకటించింది. బుధవారం ప్రధాని నరేంద్ర  మోదీ అధ్యక్షతన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి చెరుకు ఎఫ్ఆర్ పీని క్వింటాల్​​కు రూ.10 మేరకు పెంచినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్ (2022–23)లో చెరుకు ఎఫ్ఆర్​పీ క్వింటాల్​కు రూ.305 ఉండగా, తాజాగా అది 3.28% పెరిగిందన్నారు. 2014–15లో చెరుకు ఎఫ్ఆర్ పీ రూ. 210 ఉండేదన్నారు.

 ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్​లో రైతుల నుంచి రూ. 1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరుకును షుగర్ మిల్స్ కొనుగోలు చేశాయని మంత్రి తెలిపారు. 2013–14లో రూ.57,104 కోట్ల చెరుకును షుగర్ మిల్స్ కొన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ పాలనలో చెరుకు రైతులకు బకాయిలు లేకుండా చెల్లింపులు జరుగుతున్నాయని, రైతులు నిరసనలు చేయాల్సిన అవసరమే లేదన్నారు. తాజాగా చెరుకు ఎఫ్ఆర్ పీ పెంపుతో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. క్వింటాల్ చెరుకు ఉత్పత్తికి రూ.157 పెట్టుబడి అవుతుందని, తాజా పెంపుతో రైతులకు ఉత్పత్తి ఖర్చుపై అదనంగా 50% ప్రయోజనం కలుగుతుందన్నారు.  

ఎన్ఆర్ఎఫ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం 

దేశంలో పరిశోధనలకు ఊతం ఇచ్చేలా నిధులు కేటాయింపు కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు ఎన్ఆర్ఎఫ్ బిల్లు (2023)ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్, 2008ని రద్దు చేసేందుకు కూడా కేబినెట్ ఓకే చెప్పిందని ఆయన వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ఆర్ఎఫ్ లో 15 నుంచి 25 మంది ప్రముఖ రీసెర్చర్లు, ప్రొఫెషనల్స్​తో పాలక మండలి ఏర్పాటు అవుతుందని, దీనికి ప్రధాని ప్రెసిడెంట్ గా ఉంటారన్నారు. 

కెమికల్ ఎరువులు తగ్గిస్తే రాష్ట్రాలకు ఫండ్స్ 

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ అందజేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పీఎం ప్రణామ్ పథకం అమలుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని ఫర్టిలైజర్స్ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. ‘ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ లో ప్రకటించారు. రసాయన ఎరువులు తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం పెంచే రాష్ట్రాలకు ఈ పథకం కింద నిధులు అందుతాయి” అని మాండవీయ వివరించారు.