తెలంగాణ రాష్ట్ర‌ రైతుబంధు పథకంపై కేంద్రం ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర‌ రైతుబంధు పథకంపై కేంద్రం ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయనిచ్చిన ప్రజంటేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.రైతుబంధు పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రైతులను సంఘటితం చేయడానికి ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితిలను ఏర్పాటు చేసిందని, దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మర్ నెట్ వర్క్ విస్తరించిందని వివరించారు. ఈ నెట్ వర్క్ ద్వారా అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ లాంటివి సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారిక ప్రజంటేషన్ లో ప్రస్తావించారు.
ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరుఫున వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరుఫున పలు సూచనలు చేశారు.