దబాయింపుల తరీక!

దబాయింపుల తరీక!

నడిచొచ్చిన కొడుకు లాంటి తెలంగాణను.. మేమే బాగు చేశామని ఎవరూ క్లెయిమ్​ చేసుకోలేరు. ఎందుకంటే తెలంగాణ సహజ సంపన్న రాష్ట్రం. అలాంటి తెలంగాణలో ఇవాళ రైతు ఆత్మహత్యలు, విద్యార్థి, నిరుద్యోగుల ఆక్రందనలు, ఏజ్​బార్​ అయిన ఉద్యోగార్థులు, ఇండ్లులేని లక్షలాది మంది పేదలు ఎందుకున్నట్లు? విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసి.. ఓట్లు, నోట్ల రాజకీయంతో ఒంటి స్తంభం మేడలో పరిపాలన బంధీగా మారింది. పొద్దున లేస్తే రాజకీయం చతురంగ బలాలు, వ్యూహ ప్రతివ్యూహాలు తప్ప ప్రజాపాలన సాగుతున్నదెక్కడ? నాలుగు నగదు పథకాల పేర్లు చెప్పి బంగారు తెలంగాణ అయిపోయిందని చాటింపులు! ప్రజల కనీస  ప్రాధామ్యాలు గాలికొదిలేసి, నగదు పథకాలే ఓట్ల పంటకు ఎరువులంటూ.. దేశానికి అదే రోల్​మోడల్​ అని ఊరేగింపులు! నాందేడ్​ మీడియా ప్రశ్నలు మాత్రం దబాయింపులను కాస్త కట్టడి చేయగలిగాయి. ఇదే తరహాలో తెలంగాణలో పాలనా దబాయింపుల కట్టడి సాధ్యమేనా? అనేది శేష ప్రశ్నే!

అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ముఖ్యమంత్రే జవాబు చెబుతూవచ్చారు తప్ప మరొకరు సమాధానాలు ఇచ్చిన దాఖలాలు తెలంగాణలో ఇప్పటివరకు లేవు. కానీ మొన్న ఆ ఆనవాయితీ తప్పింది. ముఖ్యమంత్రి స్థానంలో ‘ముఖ్య’మైన మంత్రే సుదీర్ఘ ప్రసంగం చేశారు. తండ్రికి తగ్గ తనయుడే అన్నట్టుగా ప్రసంగం సాగింది. యువ మంత్రి  బాడీ లాంగ్వేజ్, వ్యంగ్యాస్త్రాలు, సమాధానం చెప్పే తరీక, హేళన, దబాయింపులు, మరికొన్ని బుకాయింపులు.. ఇలా ఆయన ప్రసంగం ఆద్యంతం చూసేవారికి కొంత అసహజంగా అనిపించినా, .. ట్రెజరీ బెంచీల వారు మాత్రం ఈ ‘ముఖ్య’మైన మంత్రే రేపటి ముఖ్యమంత్రి అనే భావనతోనే బల్లలు చరుస్తూ అదేపనిగా జేజేలు కొట్టారు. 

స్వీయ పొగడ్తలే బలమని..

ఏ ఎన్నికలో గెలిచినా మాపై మరింత బాధ్యత పెరిగిందని, మేము ఎదిగిన కొద్ది ఒదిగే ఉంటామనే సుభాషితాలు ‘ముఖ్య’మైన మంత్రి నుంచి ఎన్నో సార్లు విన్నాం! అలాగే, ‘‘మేమూ తిట్టగలం.. కానీ తిట్టం. మాకు సంస్కారం ఉంది’’- అని అంటూనే ప్రధానిపైనో , మరొకరిపైనో స్థాయికి మించిన ఘాటు విమర్శలు ‘ముఖ్య’మైన మంత్రి నుంచి వింటూనే ఉంటాం! అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని పరిస్థితి. వేళ్లమీద లెక్కించగలిగే ప్రతిపక్ష సభ్యుల నుంచి వచ్చే ఆ మాత్రం ప్రశ్నలను కూడా హుందాగా స్వీకరించలేకపోతే అది ఎదిగిన కొద్ది ఒదిగి ఉన్నట్లేనా? ప్రజలే కుటుంబ సభ్యులు అయినపుడు వారి కష్టాలపై ప్రశ్నించే ప్రతిపక్షాలకు హుందాగా జవాబు చెప్పే తరీక ఇదేనా? ప్రజాసమస్యలు లేవనెత్తితే.. అసలు సమాధానం వదిలి గద్దింపులే జవాబులా? ఉదాహరణకు.. కాళేశ్వరం కనిపించడం లేదా? అని ప్రశ్నించిన మంత్రి.. అదే ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేదు ఎందుకు?  ప్రపంచంలో ఎక్కడా లేని రివర్స్​పంపింగ్​ ప్రాజెక్టుగా ప్రచారం చేసి, దాన్ని ఓ ప్రముఖ చానెల్​వాళ్లతో ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్​ చేయించారు. కానీ దురదృష్టవశాత్తు గోదావరి వరదల ఉధృతి తట్టుకోలేక రక్షణ గోడలు కూలి ప్రాజెక్టు డొల్లతనం బయటపడ్డప్పటి నుంచి ‘కాళేశ్వరం’ ప్రభ ప్రశ్నార్థకమైంది. వరల్డ్​ క్లాస్​ ఇరిగేషన్​ అద్భుతమని చూపిన సదరు అంతర్జాతీయ చానెల్​వాళ్లూ కాళేశ్వరం వీడియోను తొలగించేసుకున్నారని వార్త!  ఇంత జరిగినా ఆ ప్రాజెక్టు ఫలితాలేమిటో సీఎంకు, కొందరు నిపుణులకు తప్ప బయటి ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. గోదావరిపై ఎప్పటి నుంచో ఉన్న ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి వంటి అనేక ప్రాజెక్టుల్లోకి వర్షాకాలంలో వరద నీళ్లొచ్చినా.. అవి కాళేశ్వరం నీళ్లే అయిపోతున్నాయి!  ఎక్కడ నీళ్లు కనిపించినా, ఏ చెరువు నిండినా అవి కాళేశ్వరం నీళ్లే అని నామకరణం జరిగిపోతున్నది! నిజం నీళ్లలో మునిగిపోవాల్సిందేనా?  పొగడ్తలను ప్రచారం చేసుకోవడం, అనర్థాలను దబాయించడం ఓ రివాజుగా మార్చుకుంటే.. నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులవుతారా? ఓ గౌరవ ప్రతిపక్ష సభ్యుడిని ‘వకీల్​ సాబ్​’ అంటూ వ్యంగ్య సంబోధన చేయడం సమర్థనీయమేనా? దబాయింపులు, మాటల ఫిరాయింపులు, హేళనలు ఎప్పుడూ జవాబులు కాలేవు. ఏ ఎమర్జింగ్ లీడర్ కైనా ఉండాల్సిన ఆదర్శ లక్షణాలు కావవి!

తెలంగాణ నీళ్లు మహారాష్ట్రకు ఎలా?

నాందేడ్​లో బీఆర్ఎస్ అధినేత ప్రెస్​మీట్​ఎప్పుడూ ప్రగతి భవన్​లో సాగినట్టుగా జరగలేదు! నాందేడ్ ​మీడియా వేసిన కొన్ని ప్రశ్నలకు దబాయించుడు సాధ్యపడలేదు. అనేక ప్రశ్నలకు సూటి జవాబులు లేవు. కాస్త ఇబ్బంద్దే పడ్డారు. ‘‘గోదావరిపై భారీ రివర్స్​ పంపింగ్ ​ప్రాజెక్టు కాళేశ్వరం కట్టాం. తెలంగాణను ఇప్పటికే సస్యశ్యామలం చేశాం. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ బ్యాక్​వాటర్​ను బాబ్లీకి లిఫ్ట్​ చేసుకోవచ్చని, ప్రాణహిత, ఇంద్రావతి నదులపైన కూడా ప్రాజెక్టులు కట్టుకొని మహారాష్ట్ర కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చుకోవచ్చ’’ని అక్కడి ప్రజల మెప్పు కోసం ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. మరి, ప్రాణహిత మీద ఆధారపడి నిర్మించిన కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టుల ఉనికి ప్రశ్నార్థకమేనా? ప్రాణహిత మీద మహారాష్ట్రలో ప్రాజెక్టు నిర్మించే భౌగోళిక అనుకూలత లేదు కాబట్టే కాళేశ్వరం నిర్మించగలిగాం అనే విషయం బీఆర్ఎస్​అధినేతకు తెలియనిది కాదు. మరి, అక్కడి​ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నట్లు!  గోదావరి, దాని ఉప నదులు ఎవరి వ్యక్తిగత ఆస్తులు కావు! అసలు తెలంగాణను ఏం చేద్దామని పక్క రాష్ట్రానికి ఉచిత సలహాలిచ్చారనేదే ఇవాళ తెలంగాణ అంతటా చర్చ! ఎంతైనా నదులకు నడక నేర్పే పాలకులు కదా! బీఆర్​ఎస్​ పెట్టినా.. మాది మాత్రం తెలంగాణ డీఎన్​ఏనే అని ఓవైపు యువ మంత్రి అంటున్నారు. కానీ మరోవైపు బీఆర్​ఎస్​ అధినేత మాత్రం మహారాష్ట్ర వాళ్లు గోదావరి అన్ని ఉపనదులపై ప్రాజెక్టులు కట్టుకోవచ్చని చెబుతున్నారు! మరి తెలంగాణకు రెండు డీఎన్​ఏలు ఉంటాయా? అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం అదే!


నాలుగు కోట్ల కుటుంబ పాలన?

యువ మంత్రి తమ కుటుంబ పాలనపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పే ప్రయత్నం చేశారు. ‘నాలుగు కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. కాబట్టి బరాబర్​ మాది కుటుంబ పాలనే’ అని అన్నారు. సెంటిమెంట్​ను పండించే ప్రయత్నం  చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ‘ముఖ్య’మైన మంత్రే సభను నడుపుతూ తమది కుటుంబ పాలన కాదంటే.. వినేవాళ్లు వెంగళప్పలు కారు కదా! ఎవరు అవునన్నా, కాదన్నా దేశంలోని దాదాపు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగానే మారిపోయాయి. కాబట్టి ఆ విషయంపై సమాధానమే లేనపుడు, యువమంత్రి సమర్థించుకునే ప్రయత్నం చేయడం, తనకు తాను తమ కుటుంబ పాలనను ఒప్పుకున్నట్లైంది!  తెలంగాణ ఉద్యమ రూపంలో పుట్టిన టీఆర్ఎస్​కూడా కుటుంబపార్టీగా మారుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు!  కానీ అది కుటుంబ పార్టీగా మారింది కాబట్టే, దాన్ని కుటుంబ పార్టీ అని అనకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. ఉద్యమ పార్టీ నుంచి అదొక చేదు అనుభవం. అందుకే దేశంలో అనేక కుటుంబ పార్టీలు ఉన్నా.. ఉద్యమపార్టీగా పుట్టి కుటుంబపార్టీగా మారిన టీఆర్ఎస్​ను ప్రతిపక్షాలు  ప్రత్యేకంగా కుటుంబపార్టీ అని అంటుంటాయి.  ప్రజలు గెలిపించిన వాడే పాలకుడవుతాడు. దాన్ని ఎవరూ కాదనరు. కానీ అదే సమయంలో ప్రతిపక్షాలను కూడా ప్రజలే గెలిపిస్తారని మర్చిపోవద్దు. ప్రజలు కుటుంబ పాలన కావాలని ఓటు వేయరు! తెలంగాణ బంగారం కావాలనే ఓటేశారు. అయినా మిగిలింది కుటుంబ పాలనే కదా అనే ప్రజావాక్కు ఉండనే ఉంది.

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్