ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి..

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశాలో ఓ ఇసుక కళాకారుడు 1500 కిలోల టమోటాలతో శాంతా క్లాజ్ శిల్పాన్ని సృష్టించాడు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళ లోని  కొచ్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి కేథడ్రల్ వద్ద భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ క్రిస్మస్ సందర్భంగా కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క మదర్ హౌస్‌లో ప్రార్థనలు చేస్తున్నారు.

తెలంగాణలోని పలు చర్చిల్లో అర్థరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ గీతాలు, ప్రార్థనలు, బైబిల్ పఠనాలు, సందేశాలతో చర్చిలన్నీ సందడిగా మారాయి. చర్చిలు, ఇళ్లను స్టార్స్, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. క్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా వారం రోజుల నుంచే చర్చిలు, క్రైస్తవుల ఇళ్లల్లో ప్రత్యేక ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి.

మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున శిలువ ఊరేగించి, ప్రత్యేక ప్రార్ధనలతో వేడుకలు మొదలయ్యాయి. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేసారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి, క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు క్రైస్తవులు. చర్చి పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ్. ఇంట్లో క్రిస్టమస్ ట్రీలు, లైటింగ్ సెటప్ తో అందంగా డెకరేషన్స్ చేశారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ క్రిస్మస్ సంబురాలు జరుపుకుంటున్నారు క్రైస్తవులు. కేక్ కట్ చేసి... ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ప్రార్థనల కోసం చర్చిలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.