ఎల్ఆర్‪ఎస్​ ప్రాసెస్ వెరి స్లో! టెక్నికల్ ప్రాబ్లమ్స్, సిబ్బంది కొరతతో కారణం

ఎల్ఆర్‪ఎస్​ ప్రాసెస్ వెరి స్లో! టెక్నికల్ ప్రాబ్లమ్స్, సిబ్బంది కొరతతో  కారణం

హైదరాబాద్,వెలుగు : రెండేండ్లుగా పెండింగ్ లో పడిన లే ఔట్ రెగ్యులరైజేషన్(ఎల్​ఆర్​ఎస్)​ అప్లికేషన్లను క్లియర్​ చేస్తామని గత ఫిబ్రవరిలో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించింది. వాటి పరిష్కారం ద్వారా హెచ్​ఎండీఏ ఇన్ కమ్ పెంచుకుంటామని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే తమ సమస్య పరిష్కారమవుతుందని భావించారు. కాగా.. ఎల్​ఆర్​ఎస్​ ఫైళ్ల క్లియరెన్స్ ప్రాసెస్ స్లోగా నడుస్తోంది. దీంతో హెచ్​ఎండీఏ ఆఫీసుల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. గ్రేటర్ సిటీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ ను ప్రకటించింది. దీంతో అప్పట్లో 3.50 లక్షల ప్లాట్లకు దరఖాస్తులు వచ్చాయి.  

టెక్నికల్ ప్రాబ్లమ్, సిబ్బంది కొరతనే కారణం.. 

ఎల్​ఆర్​ఎస్ స్కీమ్ లో భాగంగా అక్రమ లే ఔట్లను రెగ్యులరైజ్​ చేస్తే భారీగా ఆదాయం వస్తుందని హెచ్​ఎండీఏ భావించింది. కానీ వాటి పరిశీలనకు సమయం చాలడం లేదు. అప్లికేషన్ల పరిశీలనలో హెచ్​ఎండీఏకు సెంటర్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​(సీజీజీ) టెక్నికల్ సపోర్ట్ అందిస్తోంది. కాగా... టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు.. అప్లికేషన్ల పరిశీలనకు సరిపడా సిబ్బంది కూడా లేరని అధికారులు చెప్పారు. ఒక ప్లానింగ్​ అధికారి పరిధిలో ఒక్కరికే  వెబ్​సైట్​ లాగిన్​ అయ్యే చాన్స్ ఉంది. దీంతో వెరిఫికేషన్ లో తీవ్ర జాప్యం అవుతున్నట్టు అధికారులు పేర్కొన్నా రు. మరోవైపు.. ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, కావాలనే అధికారులు లేట్ చేస్తున్నారని దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రూ. 1200 కోట్లు వస్తాయని అంచనా..

హెచ్ఎండీఏ ఘట్​కేసర్​, మేడ్చల్​, శంషాబాద్, శంకర్​పల్లి జోన్ల పరిధిలో 3.50 లక్షల ప్లాట్ల రెగ్యులైజేషన్ కు దరఖాస్తులు వచ్చాయి. రూ. వెయ్యి చొప్పున ఫీజును దరఖాస్తుదారులు ఆన్​లైన్​ లో చెల్లించారు. అప్లికేషన్లను క్లియర్ చేస్తే.. హెచ్​ఎండీఏకు రూ.1200 కోట్ల దాకా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 50వేల ప్లాట్ల అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయి. ఇవి పూర్తయితే.. వాటికి అవసరమైన ఫీజులు వసూలు చేసి, రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్​ను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కూడా లేట్ గా నడుస్తుండగా వందలాది మంది దరఖాస్తుదారులు హెచ్​ఎండీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.  

  గైడ్ లైన్స్ మేరకు రెగ్యులరైజేషన్ 

ప్రభుత్వం ప్రకటించే గైడ్ లైన్స్ ప్రకారమే లే ఔట్లను రెగ్యులరైజేషన్ చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.  2020 సంత్సరానికి ముందు వేసిన అక్రమ లే ఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారే తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది.  ఆయా లే ఔట్లలో కనీసం10 శాతం మేర ప్లాట్ల అమ్మకాలు చేసి ఉంటేనే మిగిలిన వాటికి రెగ్యులరైజేషన్ చేసే చాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు.  అయితే10 శాతం అమ్మకం జరగని లే ఔట్లకు సంబంధించే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. 

ఇలాంటి లే ఔట్లను పరిశీలించి వాటి లెక్క తేల్చాల్సి ఉంటుందని, దీంతోనే  ప్రాసెస్ లేట్ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దేవాలయ భూములు, చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్​జోన్​, ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు ఉంటే, వాటికి ఇంతకు ముందే రిజిస్ట్రేషన్లు అయితే.. తాజా క్రమబద్ధీకరణకు అనుమతించమని అంటున్నారు.  సమస్యలు ఉన్న లే ఔట్లను ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన సిబ్బంది కొరత కూడా ఉంది. ప్రభుత్వ రూల్స్ ప్రకారమే అన్ని అప్లికేషన్లను పరిశీలించిన తర్వాతనే క్రమబద్ధీకరణ ప్రాసెస్​ చేస్తామని హెచ్​ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.