రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి: ఆరుగురు స్పాట్ డెడ్.. 35 మందికి గాయాలు

రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి: ఆరుగురు స్పాట్ డెడ్.. 35 మందికి గాయాలు

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్‎కాశీ జిల్లా కడయనల్లూరు దగ్గర రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పోలీసులు వివరాల ప్రకారం.. మధురై నుంచి సెంకోట్టై, తెన్కాసి నుంచి కోవిల్పట్టి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. 

మధురై నుంచి సెంకోట్టై వెళ్తున్న బస్సు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గాయపడిన 35 మంది ప్రయాణికులు సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని సంఘటనా స్థలంలో ఉన్న ఆరోగ్య అధికారులు వెల్లడించారు.