కుందేలు ధైర్యం

కుందేలు ధైర్యం

ఒక అడవిలో.. ఒక బుజ్జి కుందేలు ఉంది. లేత గడ్డిపోచల్ని, కమ్మని దుంపల్ని కడుపునిండా తిని తన పొదలో హాయిగా నిద్రపోతుంటుంది. అలా నిద్రపోతున్న కుందేలుకు పెద్ద శబ్దం వినిపించి, మెలకువ వచ్చింది. మెల్లగా పొదలోంచి తల బయటపెట్టి చూసింది. చెట్లను ఒక మెషిన్​ కూకటివేళ్లతో సహా పెకిలిస్తోంది. ఆ దెబ్బకు అడవిలోని చెట్లన్నీ నేలమట్టం అవుతున్నాయి. గూళ్లు కూలిపోయి పక్షులు గాల్లో ఎగురుతూ అరుస్తున్నాయి. రెక్కలు రాని పక్షులు కిందపడిపోయి భయంతో అరుస్తున్నాయి. అడవంతా అల్లకల్లోలంగా ఉంది. ఇదంతా చూస్తున్న కుందేలుకు మొదట ఏమీ అర్థం కాలేదు. అటు ఇటు చూస్తే దానికి కొంత దూరంలో రాయి మీద కూర్చుని ఒక వ్యక్తి కనిపించాడు. ఇదంతా అతని పనే అనిపించింది. మెల్లగా అతని దగ్గరికి వెళ్లి ‘‘ఎవరు నువ్వు? మా అడవిని ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు?’’ అని అడిగింది. ఆ వ్యక్తి కుందేలు వంక వింతగా చూసి, తనలో తాను నవ్వుకుంటూ ‘‘నా పేరు గంగారాం. ఈ అడవంతా నా సొంతం. మా ఇల్లు ఈ అడవికి దగ్గరే ఉంది. అడవి నరికేసి, ఈ స్థలాన్ని చదును చేస్తే ఇండ్లు కట్టి, అమ్ముకోవచ్చు. అందుకే చెట్లన్నిటినీ కొట్టేస్తున్నా’’ అన్నాడు.

ఆ మాటలకు నివ్వెరపోయిన కుందేలు ధైర్యం చేసి ‘‘ఎన్నో ఏండ్లుగా మేమంతా ఇక్కడ బతుకుతున్నాం. ఇది మా ప్లేస్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’’ అంది. దాని మాటలు విన్న ఆ వ్యక్తి కోపంతో ‘‘నాకెవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీస్తా’’ అంటూ తన జేబులోంచి తుపాకి బయటికి తీశాడు. దాంతో కుందేలు కాస్త వెనక తగ్గింది. కానీ, ధైర్యం చేసి.. ‘‘ఇది చాలా అన్యాయం. మేమెప్పుడూ మనుషులు జీవించే ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళం. ఒకవేళ వెళ్లినా ఎవరికీ అపకారం చేయం. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి’’ అని వేడుకుంది కుందేలు. అయినా అతను వినలేదు. దాంతో అతనిలో మార్పు తేవాలనుకుంది. ‘‘మనకు ఈ బాధలు రావడానికి ఆ వ్యక్తే కారణం. అన్యాయంగా మన స్థలాన్ని ఆక్రమించాడు. అతన్ని ఇలాగే వదిలేస్తే.. మనకు ఈ సగం అడవి కూడా మిగలదు. వెంటనే ఏదోలా అతని మనసు మార్చాలి. మనమంతా కలిసి ఉంటే ఆ పని చేయగలం” అని మిగతా జంతువులకు చెప్పింది. 

కుందేలు మాటలకు ‘సరే’ అన్నాయంతా. అవన్నీ కలిసి ఒక రోజు దాడి చేయడానికి రెడీ అయ్యాయి. చీమలన్నీ బారులు కట్టి ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాయి. ఇల్లంతా తిరుగుతూ ఇంట్లో వాళ్లను నానా ఇబ్బందులు పెట్టసాగాయి. తేనెటీగలు, కందిరీగలు మూకుమ్మడిగా ఇంటి మీద పడ్డాయి. పెద్ద పెద్ద జంతువులు సమీపంలోకి వచ్చి అరిచాయి. సాయంత్రం కాగానే దోమలు కూడా గుంపులుగా ఆ ఇంటిపై దాడి చేశాయి. అదంతా చూసిన అతడికి చెమటలు పట్టాయి. శరీరం వణికిపోయింది. ‘దేవుడా నువ్వే దిక్కు’ అనుకున్నాడు మనసులో. అప్పుడు కుందేలు ‘‘చూశావుగా మేమంటే ఏంటో. ఇక్కడే ఉంటే నీకు రోజూ ఇదే పరిస్థితి! మర్యాదగా అడవిని వదిలెయ్​. లేదంటే పాములు, తేళ్లు కూడా నీ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాయి’’ అంది హెచ్చరిస్తూ. దాంతో ‘బతికి ఉంటే బలుసాకు తిని బతకొచ్చు. ఇంకెప్పుడూ అడవి జోలికి వెళ్లకూడదు’ అని మనసులో అనుకుని.. ‘‘నన్ను క్షమించండి. మాకు ఇల్లు ఎలాగో, మీకు అడవి అలా అని అర్థమైంది. ఇకపై నేనెప్పుడూ అడవిని నాశనం చేయాలని మనసులో కూడా అనుకోను. నన్ను, నా ఫ్యామిలీని వదిలేయండి” అని వేడుకున్నాడు. తాము గెలిచినందుకు కుందేలుతో పాటు అడవిలో ఉండే జంతువులన్నీ ఆనందించాయి. కుందేలు ధైర్యం, తెలివిని మెచ్చుకున్నాయి.
–కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి