హైదరాబాద్ లో.. చలి పంజా

హైదరాబాద్ లో.. చలి పంజా
  • సిటీలో 12.5 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్
  • గతేడాదితో పోలిస్తే చాలా తక్కువగా నమోదు
  • సాయంత్రం అయిందంటే చలిగాలుల తీవ్రత
  • భారీగా తగ్గిన విద్యుత్ వాడకం 
  • కోర్​సిటీలో రోజుకు 18 –19 మిలియన్​ యూనిట్ల  వినియోగం  

హైదరాబాద్,వెలుగు:  గ్రేటర్ ​సిటీపై చలి పంజా విసురుతున్నది. వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రమైందంటే ఇండ్ల తలుపులు, కిటికీలు మూసేయడం, రాత్రి ఫ్యాన్​లు ఆపేసే పరిస్థితి నెలకొంది.  ప్రధాన రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున వివిధ పనులపై బయటకు వెళ్లేవారు స్వెటర్లు, మఫ్లర్లు, చలికోట్లు ధరించి  బయటికి వస్తున్నారు.  జంటనగరాల్లో చలి తీవ్రతను చూస్తే.. ప్రస్తుతం సిటీలో అత్యధికంగా 29.3 డిగ్రీల నుంచి అత్యల్పంగా 12.5 డిగ్రీలుగా నమోదవుతోంది. మరో రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

గతేడాది డిసెంబర్​లో  అత్యధిక ఉష్ణోగ్రత 28.2 , అత్యల్పంగా 13.5 డిగ్రీలుగా నమోదైంది. ప్రస్తుతం తీవ్ర చలి కారణంగా కరెంట్​ వాడకం కూడా గణనీయంగా తగ్గినట్లు విద్యుత్​శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లోనైతే రోజుకు 25 నుంచి 30 మిలియన్​యూనిట్ల వాడకం ఉండేదని..  ప్రస్తుతం18 నుంచి 19 మిలియన్ ​యూనిట్లకు పడిపోయినట్లు పేర్కొన్నారు. జంటనగరాల్లో విద్యుత్​ వాడకంపై  టీఎస్​ఎస్పీడీసీఎల్  పరిధిలోని మెట్రోజోన్​ అధికారుల లెక్కలను చూస్తే.. విద్యుత్​ వాడకం బాగా తగ్గిపోయిందని, ఫ్యాన్ల నుంచి ఏసీల వరకు దాదాపు 90 శాతం వాడకం నిలిపివేసినట్లు తెలుస్తోంది. సినిమా హాల్స్, ఫంక్షన్ ​హాల్స్​లో సైతం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా తగ్గించినట్లు మెట్రో జోన్​ సీజీఎం లక్ష్మినర్సింహ స్వామి తెలిపారు.  బల్దియా పరిధిలో రోజుకు 35 నుంచి 40 మిలియన్​ యూనిట్లు వాడకం జరుగుతుందన్నారు.  

దీంతో కరెంట్​​ బిల్లులు కూడా తక్కువగా ఉంటుండటంతో, ఇలాంటి పరిస్థితిలో ఆదాయం పెంచుకునేందుకు అధికారులు బిల్లుల పంపిణీని లేట్ చేస్తున్నారు. దీంతో కేటగిరీల్లో మార్పులు చోటు చేసుకోవడంతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని కొందరు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, మరో రెండు నెలల పాటు విద్యుత్​బిల్లులు తక్కువగానే వచ్చే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు.