మరో చారిత్రక తప్పిదమా?

మరో చారిత్రక తప్పిదమా?

నిజాం తొత్తులైన జమీందారులు, జాగిర్దారులు, భూస్వాములకు, దొరలకు, బానిసత్వానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆనాటి కమ్యూనిస్టులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, లక్ష్మీ నరసింహా రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర నాయకులు, వేలాదిమంది ముఖ్య కార్యకర్తలు సాయుధ పోరాటం చేశారు. దాదాపు 4500 మంది ప్రాణాలు అర్పించి నిరంకుశ, అరాచక, దోపిడీ నిజాం పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహా నాయకుల త్యాగాలకు చరిత్ర పుటల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం.

కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, చిరు ఉద్యోగులు పేద వర్గాల ప్రజల పక్షాన పోరాటాలు చేయడం, కార్మిక రాజ్యాన్ని స్థాపించడం కమ్యూనిస్టు పార్టీల ముఖ్య లక్ష్యం. రాజరికానికి, వంశపారంపర్య పాలనకు, ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులది. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ విధానాలతో కొంత, వ్యూహాత్మక తప్పిదాల వల్ల మరికొంత చివరకు కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం భారత కమ్యూనిస్టు(మార్క్సిస్టు) పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. 

విద్య, వైద్య రంగాలపై నిర్లక్ష్యం 

రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కౌలు రైతులు, సన్న, చిన్న కారు రైతులు వ్యవసాయంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగులు, నిరుపేదలు అనేక ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏకపక్ష పాలన నిర్బంధం, నిరంకుశ పాలన, అణచివేతలతో ప్రజాస్వామ్య విలువలను, సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నది. వీటన్నిటినీ ప్రశ్నించాల్సిన కమ్యూనిస్టులు.. రాష్ట్రంలో బీజేపీ విస్తరణను ఎదుర్కోవడానికే అనే కారణం చూపుతూ టీఆర్ఎస్​ ప్రభుత్వంతో జతకట్టడం చారిత్రక తప్పిదమే! గత 8 ఏండ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే మునుగోడులో మద్దతిస్తామని చెప్పి, కార్మికుల, కర్షకుల, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం మెడలు వంచి ఉండాల్సింది. కానీ కామ్రేడ్స్ అలా చేయలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కంటే వారు ఇతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ప్రజలు భావించే పరిస్థితి తెచ్చుకున్నారు. 

కరెంటు చార్జీల మోత

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగుల, అంగన్​వాడీ ఉద్యోగుల, వీఆర్ఏల, ఫీల్డ్ అసిస్టెంట్ల, ఆర్టీసీ ఉద్యోగులు నిత్యం ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన లేదు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, వాహనాలు రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇబ్బడి ముబ్బడిగా పెంచి ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసిందీ ప్రభుత్వం. మూడు లక్షల పేద కుటుంబాలకు డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు పూర్తయింది. అదీగాక సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే మూడు లక్షలు ఇస్తామని ఏడాది నుంచి కొత్త రాగం అందుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలతో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే.. లాఠీ చార్జీలు, గుడిసెలను కాలబెట్టుడు, అక్రమ కేసులు ఇవన్నీ కామ్రేడ్స్ తమ నాయకత్వంలో జరిపారు. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పేదల ఇండ్ల సమస్యలు అటకెక్కినట్లేనా? ఇన్ని ప్రజా సమస్యలు మూట కట్టుకున్న వ్యవస్థతో కమ్యూనిస్టులు జతకట్టడం వారి వర్గ పోరాట సిద్ధాంతానికి విరుద్ధం కాదా? కేవలం స్వీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలను సూరులో చెక్కి కష్టజీవులకు, పీడిత ప్రజలకు దూరం కావడం లేదా అని ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి కామ్రేడ్స్.

ఇలాంటి అనేక చారిత్రక తప్పిదాల వల్లే కదా.. మీరు ఉనికి కోల్పోతున్నది! నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాలంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని కమ్యూనిస్టు నాయకులకు తెలియనిది కాదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​ను లక్ష్యంగా పెట్టుకొని ముక్కలు ముక్కలు చేసిన తర్వాత వామపక్షాలు కూడా బలహీనపడి ఉన్నందున లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష వాదులను, పార్టీలను ఏకం చేయాల్సిన కమ్యూనిస్టులు.. వారు సహజంగా వ్యతిరేకించే రాచరిక, నిరంకుశ, వంశపారంపర్య విధానాన్ని బలపరచడం కంటే ఘోరం మరొకటి ఉండదు. దీని వల్ల పేద ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయో ప్రజలకు చెప్పాల్సిన కనీస ధర్మం ఉభయ కమ్యూనిస్టు పార్టీలపై ఉందని గుర్తించాలి. పెద్దలు చెబుతారు కదా! ‘దొంగలకు సద్దికట్టినట్లు’ పేద వర్గాలను, శ్రామికులను అణగదొక్కేవారికి మీరు రక్షణ కల్పించడం కూడా అలాంటిదే మరి!

రైతుల సమస్యలు

ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉమ్మడి రాష్ట్రంలో బాధపడితే, తెలంగాణ రాష్ట్రం వచ్చినా అదే పరిస్థితి కొనసాగుతున్నది. కౌలు రైతులు, రైతు కూలీలు, సన్న, చిన్నకారు రైతులు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు10 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. ఇప్పటికీ అత్యధిక మంది రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు జాతీయం చేసి 54 ఏండ్లు పూర్తి చేసుకున్నా.. రైతాంగానికి పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాలు అందడం లేదు. తెలంగాణ సర్కారు ఇస్తున్న రైతుబంధు కేవలం భూస్వాములు, ధనవంతులు, కార్పొరేటు దిగ్గజాల బంధుగానే మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం సగానికి సగం రైతులు కౌలుదారులే. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందడం లేదు. రైతుల రుణమాఫీ అటకెక్కింది. బ్యాంకుల్లో రైతుల రుణాలు వడ్డీ పెరిగి రెండింతలు అయింది. మొన్నటి వరకు ఈ రైతుల పక్షాన ఆందోళనలు, నిరసనలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని వాటిని ఎలా పరిష్కరించబోతున్నాయనేది పెద్ద ప్రశ్న?

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏవి?

ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు లేవు. రోజు రోజుకు నిరుద్యోగ సమస్య తీవ్రతరమైపోతున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్, దినసరి వేతన ఉద్యోగం చేస్తూ వేలాదిమంది యువత చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం వాగ్దానం చేసిన నిరుద్యోగ భృతి నాలుగేండ్లయినా అమలుకు నోచుకోవడం లేదు. పిల్లలు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియింబర్స్​మెంట్​ సరిగా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో సరైన వసతులు లేవు. హాస్టళ్లలో పోషకాహారం దొరక్క విద్యార్థులు నిత్యం ఆందోళన చేపడుతున్నారు.

యూనివర్సిటీలదీ అదే పరిస్థితి. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు లేవు. ఎయిడెడ్, ప్రభుత్వ కళాశాలల్లో గత 15 ఏండ్ల నుంచి ఎలాంటి నియామకాలు లేక ఎదుగుబొదుగు లేకుండా మూతపడుతున్నాయి. తెలంగాణ 33 జిల్లాల్లో 90 % ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కనీస వసతులు లేకుండా నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు విశ్వాసం తగ్గిపోతున్నది. తెలంగాణ సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేటు విద్యాసంస్థలను, విశ్వవిద్యాలయాలను, కార్పొరేట్ పాఠశాలలను నెలకొల్పుకునేం దుకు అన్ని మార్గాలను సుగమం చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీ నాయకులారా? ఇవేమీ మీకు కనిపించడం లేదా? -

కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్