చెడ్డవారితో స్నేహం చేస్తే వారి పనుల్లోనూ భాగం వచ్చి చేరుతుంది

చెడ్డవారితో స్నేహం చేస్తే వారి పనుల్లోనూ భాగం వచ్చి చేరుతుంది

ఒక వ్యక్తి తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నాడట. అది చూసిన వాళ్లు ఆ వ్యక్తి కల్లు తాగుతున్నాడు అనుకుని, అదే విషయం అందరితో చెప్పారట. అలా చెప్పడానికి కారణం పాలు, కల్లు ఒకే రంగులో ఉండటం కాదు. తాటి చెట్టు కింద నిలబడి తెలుపురంగు ద్రవ పదార్థం ఏది తాగినా అది కల్లు తాగుతున్నట్లే అనుకుంటారు. చెడ్డవారితో స్నేహం చేయటం వల్ల ఆ చెడు వ్యక్తి చేసే పాపాలలో మంచి వ్యక్తికి కూడా భాగం వచ్చి చేరుతుంది. ఇందుకు ఈ కథను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

వారణాసిలో గంగా తీరానికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులానికి విశ్వనాథ శర్మ గురువు. ఆయన వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, యోగ శాస్త్రం, పురాణాలు, వ్యాకరణం... ఒకటనేముంది సకల విద్యాపారంగతుడు. ఆయన దగ్గరకు దేశవిదేశాల నుంచి విద్యను అభ్యసించటం కోసం చాలామంది వచ్చేవారు. ఆయన దగ్గర శ్రద్ధగా చదువుకునేవారు. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా గురువుగారిని అడిగేవారు. ఆయన... శిష్యులకు తృప్తి కలిగేలా సందేహనివృత్తి చేసేవారు.

ఒకరోజు విశ్వనాథ శర్మ తన శిష్యులను వెంటబెట్టుకుని దేశాటన ప్రారంభించారు. ఆ రోజుల్లో పిల్లలకు లోకజ్ఞానం నేర్పటం కోసం గురువులు ఈ విధంగా దేశాటన చేసేవారు. అలా విద్యార్థులతో ప్రయాణిస్తూ, సముద్రతీరంలో ఆగారు. శిష్యులంతా అక్కడ సముద్రంలో కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్నారు. అలా స్నానం చేస్తుండగా దూరం నుండి వస్తున్న ఓడ  సముద్రంలో మునిగిపోతూ కనపడింది. అది చూసిన గురువుగారు, విద్యార్థులు ఎంతో బాధపడ్డారు. 

అందులో ఒక విద్యార్థి, ‘అయ్యా! గురువుగారూ! ఆ పడవ మునిగిపోవటానికి కారణం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. అందుకు ఆయన కొద్దిగా ఆలోచించి, ‘నాయనా! ఆ పడవలో ఉన్నవాళ్లలో కొందరు అన్యాయాలు చేసినవారున్నారు. అక్రమంగా ధనార్జన చేసినవారు ఉన్నారు. ఆ పాపాత్ములను శిక్షించడానికి భగవంతుడు ఈ పద్ధతిని ఎన్నుకున్నాడు’ అన్నారు. 

గురువుగారి సమాధానం ఆ శిష్యుడికి నచ్చలేదు. ‘‘పాపం చేసినవారితో పాటు, పాపం చేయనివారు కూడా పడవలో మునిగిపోయారు కదా’’ అని తనలో తాను అనుకున్నాడు. అయినా గురువుని ఎదిరించే సాహసం లేక సముద్రం ఒడ్డున ఇసుకతో చిన్నచిన్న పిచ్చుకగూళ్లు కడుతూ ఆనందిస్తున్నాడు. 
అలా ఆడుతుండగా, ఆ శిష్యుడికి ఒక శంఖం దొరికింది. అది తెల్లగా, పెద్దగా, చాలా అందంగా ఉంది. ఆ శంఖాన్ని తన స్నేహితులకు చూపిస్తూ సంతోషపడుతున్నాడు. ఇంతలో శంఖంలో నుంచి కొన్ని చీమలు బయటకు వచ్చి గట్టిగా కుట్టడం మొదలుపెట్టాయి. ఎన్నిసార్లు వాటిని విదిలిస్తున్నా, మళ్లీ కొన్ని చీమలు బయటకు వచ్చి కుడుతూనే ఉన్నాయి. అవి గట్టిగా కుడుతుంటే భరించలేక ఆ శంఖాన్ని సముద్రంలోకి విసిరేశాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గురువు... శిష్యుడిని పిలిచి ‘అంత అందమైన శంఖాన్ని ఎందుకు విసిరేశావు’ అని ప్రశ్నించాడు. 

అందుకు ఆ శిష్యుడు తడుముకోకుండా ‘శంఖంలో నుంచి వచ్చిన చీమలు నన్ను గట్టిగా కుడుతున్నాయి. అందుకే విసిరేశా’ అన్నాడు. అప్పుడు ఆ  గురువు, ‘నిన్ను అన్ని చీమలూ కుట్టాయా?’ అని ప్రశ్నించాడు.

‘లేదండీ, కొన్ని చీమలే కుట్టాయి’ అని చెప్పాడు శిష్యుడు. 

‘మరి నిన్ను కుట్టని చీమల్ని కూడా ఎందుకు సముద్రంలోకి విసిరేశావు’ అన్నాడు గురువు. శిష్యుడు నోట మాటలు రాలేదు. అప్పుడు అర్థమైంది... గురువుగారు తనకి ఏం చెప్పాలనుకున్నారో. భారతంలో భీష్మ, ద్రోణాది ప్రముఖులంతా దుష్టులైన కౌరవుల పక్షాన యుద్ధం చేయటం వల్లనే యుద్ధంలో కన్నుమూశారు. ధర్మాన్ని అతిక్రమించారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దుష్టులకు దూరంగా ఉండమని పెద్దలు చెప్తారు. మంచి వారు వారికి తెలియకుండా దుష్టులతో స్నేహం చేయటం వల్ల, వారికి కూడా చెడ్డవారనే పేరు వస్తుంది. దుర్యోధనుడితో స్నేహం కారణంగా కర్ణుడు కష్టాలపాలయ్యాడు. చివరకు తాను నేర్చిన అస్త్రశస్త్రాలను మరచిపోయి, యుద్ధంలో మరణించాడు. 

బాగా కాగిన నీటిలో పడిన నీటిబొట్టు వెంటనే ఆవిరైపోతుంది. చెడ్డవారితో చేసిన స్నేహం కూడా అటువంటిదే. ఒక్కక్షణంలోనే మంచితనం ఆవిరైపోతుందని దీని అంతరార్థం. 

అనఘునికైన చేకూరుననర్హుని గూడి చరించునంతలో మనమెరియంగ అప్పుడవమానము కీడు ధరిత్రియందునే అనువుననైన తప్పవు యదార్థము తానదియెట్టులన్నచో ఇనుమును గూర్చి అగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా!

ఎంతటి మంచివారైనా అర్హత లేనివారితో స్నేహం చేయటం వల్ల, అవమానం, అపకీర్తి కలగకమానవు. ఇనుముతో కూడిన అగ్నికి సమ్మెట దెబ్బలు పడినట్లే, చెడ్డవాని సావాసం వల్ల మంచివారి కూడా అగౌరవం కలుగుతుందని భాస్కర శతకకారుడు చెప్పాడు. 

-  డా. వైజయంతి పురాణపండ St
ఫోన్: 80085 51232