వచ్చే ఏడాది కూడా అమెజాన్ లో ఉద్యోగాల కోత..!

వచ్చే ఏడాది కూడా అమెజాన్ లో ఉద్యోగాల కోత..!

అమెజాన్ లో వచ్చే ఏడాది కూడా భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని ఆ కంపెనీ సీఈఓ యాండీ జెస్సీ స్పష్టం చేశారు. సంస్థ ఈ మధ్యనే కార్పొరేట్‌, టెక్నాలజీ, డివైజెస్, బుక్స్ విభాగాల్లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వారికి 60 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చి, ఆలోపు వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలని సూచించింది. అవసరమైతే ఉద్యోగాలు వెతికిపెట్టడంలో సాయపడతామని కంపెనీ సీఈఓ ఉద్యోగులకు చెప్పారు. 

ఒకవైపు ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు ఖర్చుల తగ్గించుకోవడంలో భాగంగా సోషల్‌ మీడియా, టెక్నాలజీ, ఈ కామర్స్‌ దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యాయి. ట్విట్టర్‌, మెటా (ఫేస్‌బుక్‌), మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ తదితర బడా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ట్విట్టర్‌ తన హెడ్‌ కౌంట్‌ను సగానికి తగ్గించగా, ఆ తర్వాత మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా అమెజాన్‌ కూడా ఈ కంపెనీల సరసన చేరింది. ‘మేం తీసుకుంది అత్యంత కఠినమైన నిర్ణయమే అయినా, సంస్థ ప్రయోజనాల కోసం తప్పడం లేదు. నేను పదవిలో ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోవడం బాధ కలిగిస్తుంది’ అని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ఆవేదన వ్యక్తం చేశారు.