బీఆర్ఎస్ నేత అక్రమంగా పట్టా చేయించుకున్నడు.. భూమి తిరిగి ఇప్పించాలి

బీఆర్ఎస్ నేత అక్రమంగా పట్టా చేయించుకున్నడు.. భూమి తిరిగి ఇప్పించాలి
  • మంచిర్యాల జిల్లా తాండూర్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఇందిరమ్మ లబ్ధిదారుల ధర్నా

  • పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • అడ్డుకున్న పోలీసులు

బెల్లంపల్లి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో కాంగ్రెస్  ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని బీఆర్ఎస్ మండల  ప్రెసిడెంట్, తాండూర్ మండల సహకార సంఘం చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కబ్జా చేసి పట్టా చేయించుకున్నాడని, ఆ భూమిని ఇప్పించాలని మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బారెపల్లికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న తాండూర్ ఎస్సై లక్ష్మణ్ అడ్డుకున్నారు. బాధితులు మాట్లాడుతూ.. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని 60 మందికి ఇందిరమ్మ పథకం కింద స్థలాలు మంజూరు చేసిందన్నారు. 


గ్రామంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో బీఆర్ఎస్ తాండూర్ మండల అధ్యక్షుడు మండల సహకార సంఘం అధ్యక్షుడు దత్తు మూర్తికి చెందిన పట్టా భూమి సర్వే నెంబర్41/అలోని 1.17 ఎకరాల భూమిని రూ.1.21 లక్షలకు లబ్ధిదారులకు కొనిచ్చిందన్నారు. ఈ భూమిని వదులుకోవడానికి ఇష్టపడని మూర్తి ఓ ప్రజాప్రతినిధి అండదండలతో పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు. దీనికి సహకరించిన అప్పటి తహసీల్దార్​తో పాటు ఇతర అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోబయట ఉన్న  తహసీల్దార్​ ఇమ్రాన్ ఫోన్​ చేసి మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.