టీచర్​ను తుపాకీతో కాల్చిన ఆరేండ్ల పిల్లాడు

టీచర్​ను తుపాకీతో కాల్చిన ఆరేండ్ల పిల్లాడు

టీచర్​ను తుపాకీతో కాల్చిన ఆరేండ్ల పిల్లాడు
మందలించినందుకు క్లాస్ రూమ్​లో కాల్పులు 
టీచర్ కండిషన్ సీరియస్.. పోలీసుల అదుపులో స్టూడెంట్
అమెరికాలోని వర్జీనియాలో దారుణం

వర్జీనియా : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. స్కూల్ టీచర్ పై ఆరేండ్ల పిల్లాడు కాల్పులు జరిపిండు. టీచర్ మందలించినందుకు క్లాస్ రూమ్ లోనే తుపాకీతో కాల్చిండు. తీవ్రంగా గాయపడిన టీచర్ కండిషన్ సీరియస్ గా ఉంది. ఈ ఘటన వర్జీనియా రాష్ట్రం న్యూపోర్ట్ న్యూస్ సిటీలోని రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్ లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ స్కూల్ లో ఆరేండ్ల పిల్లాడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లాడిని టీచర్ మందలించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఆ పిల్లాడు అప్పటికే తన బ్యాగ్​లో ఉన్న హ్యాండ్ గన్ తీసి టీచర్ ను కాల్చిండు. దీంతో క్లాస్ రూమ్​లోని పిల్లలందరూ భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్ కు వచ్చి గాయపడిన టీచర్ ను ఆస్పత్రికి తరలించారు. స్టూడెంట్లు, మిగతా టీచర్లను సేఫ్ ప్లేస్​కు తరలించి స్కూల్ కు తాళం వేశారు. పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ఈ స్కూల్ లో 550 మంది పిల్లలు చదువుకుంటున్నారు.  

ప్రమాదం కాదని తేల్చిన పోలీసులు..

ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని సిటీ పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ తెలిపారు. పిల్లాడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. క్లాస్ రూమ్ లో స్టూడెంట్లెవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. గాయపడిన టీచర్ కు 30 ఏండ్లు ఉంటాయని, ఆమె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోందని చెప్పారు. టీచర్​ హెల్త్​ కండిషన్ సీరియస్​గా ఉందని తెలిపారు. పిల్లాడికి హ్యాండ్ గన్ ఎవరిచ్చారు? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన షాక్​కు గురిచేసిందని సిటీ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జార్జ్ పార్కర్ అన్నారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని, అన్ని స్కూళ్లలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.