హిమాచల్ సీఎం సుఖ్విందర్

హిమాచల్ సీఎం సుఖ్విందర్

న్యూఢిల్లీ/సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో రెండు రోజుల హైడ్రామాకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ తొలగింది. హెచ్‌‌‌‌పీసీసీ మాజీ ప్రెసిడెంట్, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. రాష్ట్ర ఏడో ముఖ్యమంత్రిగా ఆదివారం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అగ్నిహోత్రి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం పదవి కోసం అటు బల ప్రదర్శన, ఇటు నిరసన చేసిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్.. చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని ప్రతిభ చెప్పారు. కాగా వీరభద్ర, ప్రతిభల కొడుకు విక్రమాదిత్య సింగ్‌‌‌‌కు కేబినెట్‌‌‌‌లో చోటు దక్కనున్నట్లు 
పార్టీ వర్గాలు తెలిపాయి. 

ప్రియాంక ప్రకటిస్తారని చెప్పినా..

శుక్రవారం జరిగిన సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎవరనేది తేలుతుందని భావించినా.. భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది’ అని సభ్యులందరూ కలిసి ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిర్ణయం తీసుకుంటారని శనివారం పార్టీ వర్గాలు చెప్పాయి. సాయంత్రం 4 గంటలకు ప్రియాంక ప్రకటన చేస్తారని తెలిపాయి. కానీ అలాంటి ప్రకటనేమీ రాలేదు. 

ప్రతిభ ఒత్తిడి పనిచేయలే..

సీఎం పదవి కోసం ప్రతిభా సింగ్ తీవ్రంగా ప్రయత్నించారు. తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ హైకమాండ్‌‌‌‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ అబ్జర్వర్లు ఉన్న హోటల్ వద్ద ప్రతిభా సింగ్ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు. శనివారం కూడా ప్రతిభా సింగ్ మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలామంది సపోర్ట్ ప్రతిభా సింగ్‌‌‌‌కు లేదని, దీంతో సీఎం రేసు నుంచి ఆమె తప్పుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. సుఖ్విందర్‌‌‌‌‌‌‌‌కు 25 మందికి పైగా ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని, అందుకే ఆయన్ను సెలక్ట్ చేశామని తెలిపాయి.

పాలు అమ్మిన చోటే పాలకుడై..

1964 మార్చి 27న పుట్టిన సుఖ్విందర్ సింగ్ సుఖు.. ఎంఏ, ఎల్ఎల్‌‌‌‌బీ చదివారు. రోడ్డు ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ కొడుకై న సుఖు..  ఒకప్పుడు ఛోటా సిమ్లాలో పాల వ్యాపారం చేశారు. కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. హామిర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని నదైన్‌‌‌‌ నుంచి 2003లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా,  2013 నుంచి 2019 దాకా హెచ్‌‌‌‌పీసీసీ చీఫ్‌‌‌‌గా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌‌‌‌గా ఉన్నారు.