బీజేపీపై కాంగ్రెస్​ నేతల మండిపాటు

బీజేపీపై కాంగ్రెస్​ నేతల మండిపాటు

ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి దేశ సంపదను సృష్టిస్తే, బీజేపీ దాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అధ్యక్షతన ‘75వ స్వాతంత్ర్య దినోత్సవం – దేశాభివృద్ధికి కాంగ్రెస్ సోపానాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..  బీజేపీ ధనవంతులను అత్యంత ధనికులుగా చేస్తూ, పేదలను మరింత పేదరికంలోకి నెడుతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. జాతీయ సంస్థలను ప్రైవేటుపరం చేయడం అంటే దేశంలోని ప్రజలను అమ్మేయడమే అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశంలో అరాచకాలకు అవినీతికి అడ్డగా నిలిచిన బీజేపీ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆ పార్టీని ఇంటికి సాగనంపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ ​అవినీతిపై విచారణ చేపట్టాలె

బీజేపీ దేశంలో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పదేపదే ఆరోపించే బీజేపీ, ఎందుకు కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించడం లేదో   సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రీతం మాట్లాడుతూ దళితులకు వ్యవసాయ భూమి ఇచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.