సీఎం ఇలాకాలో ఇస్తామన్నవి 500.. కేటాయించినవి 240

సీఎం ఇలాకాలో ఇస్తామన్నవి 500.. కేటాయించినవి 240

మెదక్/తూప్రాన్​, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణం నత్తనడకనసాగుతోంది.  నాలుగేండ్ల కింద సీఎం హామీ మేరకు ప్రభుత్వం 504 ఇండ్లు మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి రూ.25.25 కోట్లు కేటాయించింది. 2018లోనే వాటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏడాది లోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా చేసిన 
పనులకు బిల్లులు రాకపోవడం, ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు పెండింగ్​లోనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ ​రావు ​పలుమార్లు పంచాయతీరాజ్​శాఖ అధికారులతో రివ్యూ చేసి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించినా పురోగతి లేదు. ఇప్పటి వరకు కేవలం 240 ఇండ్లు మాత్రమే పూర్తికాగా, అధికారులు వాటిని లబ్ధిదారులకు కేటాయించి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే పూర్తి అయినా  ఇండ్ల వద్ద మౌలిక వసతులు ఇంకా కంప్లీట్​ చేయలేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి నల్లాలు, విద్యుత్తు సరఫరాకు సంబంధించిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కాగా, మరో 200 ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉండగా, ఇంకో 60 ఇండ్లు మాత్రం పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తి కావాలంటే దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉంది. కానీ రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతుండటం 
గమనార్హం.
లక్కీడ్రా తీసి కేటాయింపు..
పూర్తయిన 240 డబుల్​ బెడ్​ ​రూమ్ ​ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు బుధవారం తూప్రాన్​లో అధికారులు లక్కీ డ్రా తీశారు.  ఈ విషయం తెలుసుకుని డబుల్ బెడ్​ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు వెయ్యి మంది వరకు తరలివచ్చారు. తీరా 240 మందికి మాత్రమే ఇండ్లను కేటాయించడంతో మిగతా వారు నిరాశకు గురయ్యారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా ఇండ్లు దక్కలేదని కొందరు కంటతడి పెట్టారు. మరికొందరు తమకు కూడా ఇండ్లు కేటాయించాలంటూ అధికారులతో గొడవ పడ్డారు. ‘తూప్రాన్​ పట్టణంలో పేదలకోసం 500 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు నిర్మిస్తాం. అందుకోసం ఇప్పుడే రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా. ఏడాది లోపు వీటి నిర్మాణం పూర్తి చేయిస్తాం. మళ్లీ నేనే వచ్చి డబుల్​ఇండ్లను ప్రారంభిస్తా’- 2018లో తూప్రాన్​ లో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలివి. కానీ నాలుగేండ్లు గడచినా సీఎం హామీ అమలుకు నోచలేదు. అన్నీ సంగం సగం పనులు.. ఆగమాగం ఉన్నాయి. 
అన్నీ పూర్తిచేసి  ఇవ్వాలి
తూప్రాన్ మున్సిపల్ లో ఇండ్లు లేని పేదలందరికీ డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు కట్టించి ఇస్తామన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలి. ఆగమేఘాల మీద కొందరికే ఇండ్లు కేటాయించడంతో మిగతావారు తమకు ఇండ్లు వస్తాయో, రావోనని ఆందోళన చెందుతున్నారు. అందుకు ప్రభుత్వం వెంటనే మిగతా ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.       - మహేశ్​గౌడ్, బీజేపీ తూప్రాన్​ టౌన్ ప్రెసిడెంట్ 
నెలలో మొత్తం పూర్తి చేస్తాం
తూప్రాన్ లో మంజూరైన 500 డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లలో 240 ఇండ్లు  కంప్లీట్ అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇండ్లను ఈనెలలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం.
- నర్సింలు, పంచాయతీ రాజ్ డీఈఈ, తూప్రాన్