పీక్ స్టేజ్ పూర్తయింది.. ఈ నెలాఖరుకు కంట్రోల్ లోకి​

పీక్ స్టేజ్ పూర్తయింది.. ఈ నెలాఖరుకు కంట్రోల్ లోకి​
  • నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్‌ సైంటిస్టుల అంచనా
  • ఫలిస్తున్న లాక్​డౌన్​.. వచ్చే పది రోజుల్లో మరింత తగ్గుదల

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్​ వేవ్​ డౌన్  ట్రెండ్ మొదలైంది. ఈ నెల చివరికల్లా పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో వైరస్ పీక్ స్టేజ్​ పూర్తయి, కేసుల్లో తగ్గుదల మొదలైందని ఐసీఎంఆర్‌‌‌‌కు అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్‌‌(ఎన్ఐఎన్) సైంటిస్టులు అంచనా వేశారు. ‘‘ఇప్పటికే డౌన్ ట్రెండ్ మొదలైంది. వచ్చే పది రోజుల్లో ఈ ట్రెండ్‌‌ స్పష్టంగా కనిపిస్తుంది’’ అని ఎన్‌‌ఐఎన్‌‌ సీనియర్ సైంటిస్ట్‌‌, రాష్ట్రంలోని సెరో సర్వేల చీఫ్‌‌ డాక్టర్ లక్ష్మయ్య ‘వెలుగు’కు వివరించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, మెడికల్ ఎక్స్‌‌పర్ట్‌‌లు కూడా మే చివరి వరకూ ఇండియాలో సెకండ్​ వేవ్​ అదుపులోకి వస్తుందని అంచనా వేశారు. ఈ అంచనాలపైనే ప్రభుత్వాలు, ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ట్రెంట్​ చూస్తే అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ‘‘దేశవ్యాప్తంగా స్లో డౌన్ స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కేసులు తక్కువగా చూపిస్తుండొచ్చు. బులెటిన్‌‌లో చూపించినంత తక్కువగా కేసులు లేకపోవచ్చు. కానీ, మన దగ్గర కూడా తగ్గుదల మొదలైంది’’ అని డాక్టర్ లక్ష్మయ్య అన్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటళ్లకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గిందంటున్నారు. 

‘వారం రోజుల కిందటి వరకూ మా దగ్గర బెడ్డు దొరకడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు పదుల సంఖ్యలో ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. 3 రోజుల నుంచి వెంటిలేటర్లు కూడా ఖాళీ అవుతున్నాయి. హాస్పిటల్‌‌‌‌ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ల కంటే, కొత్తగా వచ్చేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది’ అని నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌‌‌‌ ఐసీయూ ఇన్​చార్జ్‌‌‌‌, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ వివరించారు. ‘మా దగ్గర ఇంతకుముందు బెడ్డు కోసం ఎమర్జెన్సీలో ఐదారుగురు పేషెంట్లు వెయిటింగ్‌‌‌‌లో ఉండేవాళ్లు. ఇప్పుడు ఐదారు బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి’ అని హైదారాబాద్‌‌‌‌లోని లీల హాస్పిటల్‌‌‌‌కు చెందిన డాక్టర్‌‌‌‌ సుధీర్  చెప్పారు. ఇప్పుడు వస్తున్న వాళ్లు కూడా పది రోజుల కింద ఇన్‌‌‌‌ఫెక్ట్‌‌‌‌ అయినవాళ్లేనని, ఫ్రెస్ ఇన్ఫెక్షన్ కేసులు తక్కువగానే ఉంటున్నాయని ఆయన అన్నారు. 

పది రోజుల్లో ఇంకా తగ్గొచ్చు

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో  రెండు వారాలుగా లాక్‌‌‌‌డౌన్ అమలవుతోంది. కరోనా కట్టడికి ఇది చాలా ఉపయోగపడిందని డాక్టర్లు చెప్తున్నారు. వారం రోజులుగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ సహా 18 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం స్పల్పంగా పెరుగుదల ఉంది. మన రాష్ట్రంలో సర్కార్ చెప్పేవి పూర్తిగా తప్పుడు లెక్కలే అయినప్పటికీ, వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్టు గ్రౌండ్​లెవల్​లో పనిచేసే డాక్టర్లు చెప్తున్నారు. ఈ పది రోజుల లాక్‌‌‌‌డౌన్ తర్వాత మరింత తగ్గొచ్చంటున్నారు. ‘నాలుగైదు రోజుల నుంచి ఇన్‌‌‌‌పేషెంట్ నంబర్‌‌‌‌‌‌‌‌లో డిక్రీజింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. బెడ్డు కావాలని ఫోన్ చేసే వాళ్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మా ఒక్క హాస్పిటల్‌‌‌‌లోనే కాదు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని చాలా హాస్పిటళ్లలోనూ పేషెంట్ లోడ్‌‌‌‌ తగ్గింది. ఈ పది రోజుల లాక్‌‌‌‌డౌన్ తర్వాత ఇంకా తగ్గొచ్చని అనుకుంటున్నాం’ అని కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని రాజన్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు చెందిన డాక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వివరించారు.

అంచనాలు కరెక్టే!

ఈ నెల మూడో వారంలో కరోనా డిక్రీజింగ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చాలా సంస్థలు అంచనా వేశాయి. దేశంలో రికవరీ రేట్‌‌‌‌ 79 శాతానికి వచ్చాక కరోనా పీక్‌‌‌‌ నమోదవుతుందని, ఆ తర్వాత తగ్గుదల మొదలవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్‌‌‌‌లోనే ఒక రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. మే మూడో వారంలో రికవరీ రేట్ 79 శాతానికి వస్తుందని ఆ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.  శనివారం నాటికి దేశంలో 83 శాతం రికవరీ రేట్ నమోదైంది. ఈ లెక్కన ఎస్‌‌‌‌బీఐ రిపోర్ట్‌‌‌‌ నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, కేంబ్రిడ్‌‌‌‌ యూనివర్సిటీ  కూడా మే నెల మధ్యలో పీక్ స్టేజ్​ వస్తుందని నెల రోజుల కింద ప్రకటించాయి. పీక్ టైమ్‌‌‌‌లో రోజుకు ఐదు వేల మరణాలు నమోదవుతాయని ఆయా సంస్థలు అంచనా వేశాయి. ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌లోని సీసీఎంబీ, ఎన్‌‌‌‌ఐఎన్ వంటి సంస్థలు మే రెండో వారంలో పీక్ నమోదవుతుందని, మే చివరి వరకూ కంట్రోల్‌‌‌‌లోకి వస్తుందని ప్రకటించాయి. ఈ అంచనాలన్నీ నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

వర్క్‌‌‌‌లోడ్ తగ్గింది

వర్కల్‌‌‌‌ లోడ్ చాలా తగ్గింది. మా దగ్గర బెడ్డు కోసం ఎమర్జెన్సీలో వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఈ వన్ వీక్ నుంచి అదేం లేదు. కొన్ని బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌, రూల్స్ ఇలాగే కంటీన్యూ చేస్తే ఇంకా తగ్గొచ్చు. కానీ, మా దగ్గర కొన్ని కేసులు ఒకే ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. వాళ్లను ఆరా తీస్తే పెండ్లిళ్లకో, ఫంక్షన్లకో అటెండ్ అయిన హిస్టరీ ఉంటోంది. ఇప్పుడు తగ్గినా, పెండ్లిళ్లతో మళ్లీ పెరుగుతుందేమో అనిపిస్తోంది.

- డాక్టర్ ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, 
  రాజన్ హాస్పిటల్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌

కొత్త కేసులు పెద్దగా రావట్లే

వారం నుంచి కేసులు పెరుగుతలేవు. ఇంతకుముందులా బెడ్ల కోసం వెయిటింగ్‌‌లో ఉండే పరిస్థితి లేదు. ఫ్రెష్ కేసులు కూడా పెద్దగా రావట్లేదు. రిఫరల్‌‌ కేసులే వస్తున్నాయి. లాక్‌‌డౌన్ పెట్టడం, బార్డర్లు క్లోజ్ చేయడం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. ఇంకో వారం రోజులైతే పరిస్థితి ఏంటో కచ్చితంగా తెలిసిపోతుంది.
‑ డాక్టర్ శ్రీధర్‌‌‌‌, 
అపోలో హాస్పిటల్స్‌‌, హైదరాబాద్‌‌.