ఆరేళ్లలో ప్రాజెక్టుల ఖర్చు డబుల్..అందనంతగా పెరిగిన అంచనాలు

ఆరేళ్లలో ప్రాజెక్టుల ఖర్చు డబుల్..అందనంతగా పెరిగిన అంచనాలు
  • 11 ప్రాజెక్టుల మొత్తం తొలి అంచనాలు రూ. 89,208 కోట్లు
  • ఇప్పుడు రూ. 2 లక్షల కోట్లకు చేరినయ్
  • మిగతా ప్రాజెక్టులదీ అదే పరిస్థితి
  •  కాళేశ్వరం కంప్లీట్ అయ్యేసరికి ఖర్చు రూ.1.50 లక్షల కోట్లు

 

రాష్ట్ర ప్రభుత్వం భారీగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా ఎకరం ఆయకట్టుకు కూడా నీళ్లు అందకున్నా .. అంచనాల పెంపు.. అదనపు టీఎంసీ పనులతో ఖర్చు అనూహ్యంగా పెరిగింది. రీ డిజైన్‌ తర్వాత కాళేశ్వరం ఖర్చు మూడు రెట్లు పెరిగింది. పనులు కాకున్నా రెట్టింపు ఖర్చుతో పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. నిర్మాణం ఆలస్యమైన కొద్దీ ఖర్చులు పెరుగుతాయని, అంచనాలు అదే విధంగా మారుతాయని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ ఒక్క ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టు యేడాదిన్నరలోనే డబుల్‌‌ కావటం గోల్మాల్ను తలపిస్తోంది. ఏండ్లకేండ్లుగా సాగుతున్న వరద కాలువ అంచనాలు ఎనిమిది రెట్లు పెరిగిపోయాయి.

 ఇదీ కాళేశ్వరం లెక్క..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 38,500 కోట్లతో 2008లో అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పదకొండు వేల కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైన్‌ చేశారు. రూ. 80,190 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇచ్చారు. ప్రాజెక్టు లింక్‌ వన్, లింక్ టూలో ఎస్టిమేట్లకు మించి రూ. 8,304 కోట్ల ఖర్చు పెరుగగా, అడిషనల్‌ టీఎంసీ కోసం మరో రూ. 26 వేల కోట్లకు పైగా ఖర్చుతో పనులు చేపడుతు న్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం మొత్తం ఇప్పటికే రూ.1.14 లక్షల కోట్లు దాటింది. లింక్‌ ఫోర్ ఎస్టిమేట్లు పెంచేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందనే అంచనాలున్నాయి.

దేవాదుల సహా మిగతా ప్రాజెక్టులకు భారీగానే..

దేవాదుల లిఫ్ట్‌స్కీంను 3 స్టేజీల్లోరూ. 8,560 కోట్ల అంచనాలతో చేపట్టగా ఆ ప్రాజెక్టు వ్యయం 30 శాతానికి పైగా పెరిగింది. సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,445.44 కోట్లుగా ఉండగా.. పనులు పూర్తయ్యేసరికి ఇంకో 20 శాతం వరకు ఖర్చు పెరిగే చాన్స్ ఉంది. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో రూ. 2,813 కోట్లతో అనుమతులివ్వగా.. రాష్ట్రం వచ్చిన తర్వాత అంచనాలను రూ. 3,152.72 కోట్లకు పెంచారు. డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను తెలంగాణ ఆవిర్భావం తర్వాతే ప్రతిపాదించినా దీని వ్యయం మూడు రెట్లకన్నా ఎక్కువే పెరిగింది. రిజర్వాయర్‌ స్వరూపంలో కొద్దిపాటి మార్పులే చేసినా ఖర్చుమాత్రం భారీగా పెరిగింది. కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీం కెపాసిటీ పెంచే ప్రాజెక్టుపనుల రివైజ్డ్‌ ఎస్టిమేట్లకు ఆమోదం తెలుపకున్నా ఇరవై శాతానికిపైగా ఖర్చు పెరిగినట్టు తెలుస్తోంది. ఉదయ సముద్రం లిఫ్ట్‌స్కీంను ఉమ్మడి రాష్ట్రంలో రూ. 699 కోట్లతో చేపట్టగా ఇప్పటి కే డబుల్ అయింది. కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌స్కీం నిర్మాణ వ్యయం తెలంగాణ వచ్చాక 40 శాతానికి పైగా పెరిగింది. ఆర్ఎడీస్‌ ఆధునీకరణ పనుల విలువ కూడా రెట్టింపయింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టును సీతారామ లిఫ్ట్‌ స్కీం పేరుతో రీ డిజైన్‌ చేసి రెట్టింపు అంచనాలతో పనులు చేస్తున్నారు. దుమ్ముగూడెం ఆనికట్‌ను సీతమ్మసాగర్‌ బ్యారేజీగా నిర్మించేందుకు రూ. 3,481.90 కోట్లతో శాంక్షన్‌ ఇచ్చారు. 2015లో లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టుకు రూ. 1,227 కోట్లతో శాంక్షన్‌ ఇచ్చారు.

పాలమూరు- రంగారెడ్డి ఖర్చు రూ. 55 వేల కోట్లు

ఇప్పటికీ మూడో వంతు పనులు కూడా పూర్తి కాని పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు ఇంచుమించుగా రెట్టింపయ్యాయి. 2015లో రూ. 35,200 కోట్లతో ఈ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇచ్చారు. క్రమంగా రీ డిజైన్లు, పనులను జోడించి ఈ అంచనాలను ప్రభుత్వం  పెంచుతూ పోతోంది. ఇప్పటికే సవరించిన అంచనాలు రూ. 52 వేల కోట్లు దాటింది. ఉద్దండపూర్‌‌ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి మధ్యప్యాకేజీలను ఒక టీఎంసీకి కుదించారు. ఈ పనులు కలుపుకొంటే పాలమూరు ప్రాజెక్టు ఖర్చు రూ. 55 వేల కోట్లకు చేరుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఎస్టిమేషన్ ఫిగర్ డబుల్ జంప్ ఖాయమని అంచనాలు వేస్తున్నారు

రీ డిజైన్ పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులను కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిపై పెట్టే ఖర్చును అదే స్థాయిలో పెంచేసింది. గడిచిన ఆరేండ్లలోనే అన్ని ప్రాజెక్టుల అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయి. మొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మొత్తానికి.. ఇప్పుడు చేపడుతున్న పనుల ఖర్చుకు అసలు పొంతన లేనంత తేడా కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, ఎస్సారెస్పీ పునరుజ్జీవం మినహా మిగతా ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టినవే. 11 ప్రధాన ప్రాజెక్టుల మొత్తం ఫస్ట్ ఎస్టిమేషన్స్ రూ. 89,208 కోట్లు అయితే.. ఇప్పుడు అది రూ. రెండు లక్షల కోట్లకు చేరింది. అంటే.. రూ.1.10 లక్షల కోట్ల దాకా పెరిగింది. మిగతా ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కలిపితే మరో రూ.10 వేల కోట్ల వరకు జంప్ అయిందని ఇరిగేషన్ రికార్డులే వెల్లడిస్తున్నాయి.

పునరుజ్జీవం రెట్టింపు.. 8 రెట్లయిన వరద కాలువ ఖర్చు

మూడు పంపుహౌస్‌లతో ప్రతిపాదించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టును రెండు పంపు హౌస్‌లకే కుదించినప్పటికీ.. ఖర్చు తగ్గకుండా ఎగబాకింది. మొదట రూ.1,067 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇవ్వగా మధ్యలో ఖర్చును రూ.1,751 కోట్లకుపెంచారు. కొన్ని నెలల వ్యవధిలోనే మరో రూ. 200 కోట్లు యాడ్ చేశారు. ఎస్సారెస్పీనుంచి మిడ్ మానేరుకు నీటిని తెచ్చే ఇందిరమ్మ వరద కాల్వ అంచనాలు కొత్త రాష్ట్రం వచ్చాక భారీగా పెరిగిపోయాయి. 2009లో ఈ ప్రాజెక్టు అంచనా రూ. 4,700 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణం సుదీర్ఘంగా జరగడం, వరుస కాలయాపనతో ఈ ఖర్చు భారీగా పెరిగింది. తొలుత 1996లో వేసిన అంచనాతో పోలిస్తే ఎనిమిది రెట్లు దాటింది. రూ.9,886.19 కోట్లతో రివైజ్ చేసింది ప్రభుత్వం.