రైతులు అమ్మినంక పత్తి రేటు పైపైకి

రైతులు అమ్మినంక పత్తి రేటు పైపైకి
  • రూ.12 వేలు కూడా దాటొచ్చంటున్న ట్రేడ్​ వర్గాలు
  • తెగుళ్లతో సగానికి పడిపోయిన దిగుబడి
  • దేశీయంగానే పత్తికి పెరుగుతున్న డిమాండ్​

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో పత్తి రేటు రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. ఈ ఏడాది అత్యధికంగా క్వింటాల్ పత్తి ధర రూ.11,150 ఉండగా, శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.11,500 పలికింది. మోడల్ రేటు రూ.10,800  ఉండగా, కనిష్టంగా రూ.5 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో పత్తి సాగు తగ్గడం, అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి బాగా పడిపోయింది. గతంలో చైనా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. ఇప్పుడు గుజరాత్, తమిళనాడు, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర నుంచే మన పత్తికి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. దేశీయంగా ఫుల్ డిమాండ్ ఉండడంతో ధర అంతకంతకు పెరుగుతున్నదని వ్యాపారులు చెప్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ధర రూ.12 వేలు కూడా దాటవచ్చని అంటున్నారు.

లాభం వ్యాపారులకే
పత్తికి రికార్డు స్థాయిలో రేటు పలుకుతున్నా.. రైతులకు మాత్రం ఆ లాభం దక్కట్లేదు. వర్షాల కారణంగా తెగుళ్లు సోకి పత్తి దిగుబడి తగ్గింది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు రావాల్సింది కాస్తా, ఈ ఏడాది ఎకరానికి ఆరు క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్​ధర రూ.6500 ఉండగా ఫిబ్రవరి చివరి నాటికి రూ.9 వేల వరకు చేరింది.  మొదటి సారి ఈనెల 11న రూ.10 వేలకు చేరగా, రెండు వారాల్లోనే మరో రూ.1500 పెరిగింది. అయితే రైతులు ఇప్పటికే పంట అంతా అమ్ముకున్నారు. ఇప్పుడు రైతుల వద్ద పది శాతం లోపే పంట ఉందని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే రైతుల నుంచి చాలా వరకు పంట సేకరించిన వ్యాపారులు దేశీయంగానే డిమాండ్ పెరుగుతుండడంతో పత్తిని స్టాక్ చేస్తున్నారు.

తెగుళ్లతో దిగుబడి తగ్గింది
నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశా. తెగుళ్ల వల్ల దిగుబడి ఎకరానికి ఆరు క్వింటాళ్లు కూడా రాలేదు. చివరిగా తీసిన పత్తిని శుక్రవారం మార్కెట్లో అమ్మితే క్వింటా రూ.11,500 రేటు పడింది. అయినా, పెట్టుబడులు, కూలి ఖర్చులు పోను మిగిలేది కొంచమే. రేటు ఎక్కువగా ఉన్నా.. దిగుబడి లేకపోవడంతో లాభం లేదు.
- ‌‌‌‌‌‌‌‌కంచర్ల వెంకటేశ్వర్లు, చింతపల్లి, ఖమ్మం రూరల్​ మండలం 

ఊర్లో వ్యాపారులకే అమ్మేశా
ఐదు ఎకరాలలో ప్రత్తి సాగు చేశాను. పంట అమ్మాలంటే  30 కిలోమీటర్ల దూరంలో ఉన్న  తల్లాడ, 40 కిలోమీటర్ల  దూరంలోని జూలూరు పాడుకి వెళ్లాలి. ఇందుకు రవాణా ఖర్చు, కూలీ రూ.3వేల దాకా అయితది. అందుకే ఊళ్లోనే ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకున్నా. ప్రతి మండలంలో ప్రత్తి కొనుగోలు సెంటర్ పెడితే చిన్నరైతులకు మేలైతది. 
- నాగాంజనరావు, రామచంద్రరావు బంజర్, పెనుబల్లి మండలం 

దిగుబడి లేక అప్పు మిగిలింది
ఎకరం రూ.15 వేలు లెక్కన 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాను. మొత్తం 15 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్వింటాల్​ రూ.7వేలకు అమ్మిన. రెండేండ్లుగా చీడ పురుగులు, వానలకు పంట దిగుబడి రాలేదు. పెట్టుబడి కూడా రాక రూ.2 లక్షల అప్పు మిగిలింది.
- మల్లెంపాటి అనంతరామయ్య, కౌలు రైతు, తల్లాడ