బీజేపీ పాలనలో దేశం దూసుకెళ్తోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

బీజేపీ పాలనలో దేశం దూసుకెళ్తోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కాగజ్​నగర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్​రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో  కేంద్ర మంత్రులే జైలు కెళ్లారని,  బొగ్గు,  2జీ,   కామన్ వెల్త్ గేమ్స్ లాంటి అనేక స్కామ్​లతో   దేశ ప్రతిష్ఠను దిగజార్చారని విమర్శించారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్​లోని సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ రబ్బర్ స్టాంప్, రిమోట్ కంట్రోల్ ప్రధాన మంత్రిగా ఉండేవారని, ఇప్పుడు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నాయకుడు  మోదీ దేశ ప్రధానిగా ఉన్నాడని కితాబిచ్చారు. బెస్ట్ డెమోక్రసీ ఇన్ వరల్డ్ భారతదేశం అన్నారు. 2014 నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నరేంద్ర మోదీ అవినీతి పరుడని ప్రపంచంలో ఒక్కరు కూడా అనలేదన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు, నరేంద్ర మోదీ వైపు చూస్తోందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే మన ప్రధాని చేతులు కట్టుకునే స్థాయి పోయి, అమెరికా అధ్యక్షుడు మన ప్రధాని  ముందు చేతులు కట్టుకునేలా  మారిందన్నారు.

కశ్మీర్​లో మత కల్లోలాలు, బాంబులు, రాళ్లతో పోలీసులను కొట్టే దుస్థితి పోయి ఇప్పుడు ప్రశాంత కశ్మీర్ ఏర్పడిందని, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో మువ్వన్నెల జెండా  రెపరెప లాడుతోందన్నారు. ఐఎస్ ఐ నెట్‌వర్క్ ను లేకుండా చేసిన ఘనత నరేంద్ర మోదీదేనన్నారు.పాకిస్తాన్ కు ప్రపంచ దేశాలు ఉప్పు పెట్టకుండా చేశామన్నారు.  చైనా తప్ప వారికి సహకరించే వారులేరని పాకిస్తాన్​లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న ఏకైక దేశం భారతదేశం అన్నారు. ఉక్రెయిన్-, రష్యా యుద్దాన్ని ఒకరోజు ఆపి 25 వేలమంది భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకచ్చామని చెప్పారు. మన జెండా పట్టుకొని అనేక దేశాల స్టూడెంట్లు వచ్చారని తెలిపారు. బీజేపీ పార్టీ కుటుంబ పార్టీ కాదని, అందరికీ అవకాశం ఇచ్చే పార్టీ అన్నారు. మిగిలిన పార్టీల్లో కాబోయే పార్టీ అధ్యక్షుడు, సీఎం అభ్యర్థులు ఉంటారని , బీజేపీలో అలా ఉండదని చెప్పారు. మరోసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం..

ఎస్​పీఎం విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, కార్మికులకు  అండగా ఉంటామని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు. పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని, సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యాన్ని అవసమైతే ఢిల్లీకి పిలిచి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండాలో మాట్లాడి, కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సిర్పూర్ టీ, ఆదిలాబాద్ఎ మ్మెల్యేలు పాల్వాయి హరీశ్​బాబు, పాయల్ శంకర్, ప్రబారి రాజమౌళి గౌడ్, బీ ఎం ఎస్ రాష్ట్ర నాయకుడు భట్టాచార్య, బీజేపీ టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన  కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.