వాళ్లు కొన్న భూమి చెల్లదు

వాళ్లు కొన్న భూమి చెల్లదు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌‌‌‌‌‌‌లో 26.16 ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యులు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పి.గోవిందరెడ్డి ఇతరులు కొనుగోలు చేయడం చెల్లదని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ఆ భూమి విషయంలో జోక్యం చేసుకోరాదని గతంలో సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.నందల బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణ కొనసాగించింది. ఆ భూమిలో కొంత మేరకు మల్లయ్య అనే వ్యక్తికి అసైన్‌‌‌‌‌‌‌‌ చేస్తే తీసుకోలేదని, ఫలితంగా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అదనపు ఏజీ రామచందర్‌‌‌‌‌‌‌‌రావు కోర్టుకు చెప్పారు. మాజీ సైనికులకు 5 ఎకరాలు చొప్పున ఇవ్వడం1963లో మొదలైతే అప్పటి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ సంతకాలను ఫోర్జరీ చేసి ఆ పథకం అమలులోకి రావడానికి 2 ఏండ్లు ముందే నరసింహలు నాయక్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా బోగస్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ సృష్టించారని చెప్పారు. వాటిపై సంతకాలు, అప్పటి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ సంతకాలకు పోలిక లేదని, ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్‌‌‌‌‌‌‌‌ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు.

15 ఏండ్ల తర్వాత సేత్వారీని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తించదన్నారు. భూమిపై హక్కులు లేని వాళ్ల నుంచి రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరులు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. కాగా కోర్టు విచారణను ఈ నెల18కి వాయిదా వేసింది.