కామ్రేడ్లకు ఎందుకు కోపమొచ్చింది?

కామ్రేడ్లకు ఎందుకు కోపమొచ్చింది?

కేసీఆర్​ సర్కార్​కు వ్యతిరేకంగా లెఫ్ట్​ పార్టీల భూపోరాటాలు
వామపక్ష నేతలపై కుట్ర కేసులు పెడుతున్న ప్రభుత్వం
3 నెలలు తిరక్కుండానే దోస్తీ బెడిసికొట్టిందా? అని చర్చ

హైదరాబాద్, వెలుగు : నిన్నమొన్నటి వరకు కేసీఆర్​ సర్కార్​తో జతకట్టిన సీపీఐ, సీపీఎం ఇప్పుడు ఆందోళన బాట పట్టాయి. మూడు నెలల క్రితం బీఆర్ఎస్ నాయకులతో కలిసికట్టుగా తిరిగిన లెఫ్ట్​ పార్టీల లీడర్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూపోరాటాలకు దిగుతున్నారు. అసలు కామ్రేడ్లకు సడెన్​గా ఎందుకు కోపమొచ్చింది. బీఆర్ఎస్​పై ఎందుకు ఎర్రజెండా ఎగరేశారనేది ఆసక్తి రేపుతోంది. కొద్ది రోజులుగా లెఫ్ట్​ లీడర్లకు ప్రగతిభవన్​లోకి నోఎంట్రీ బోర్డు పెట్టడంతోపాటు.. వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే గ్రేటర్​ సిటీ పరిధిలోని పెద్ద అంబర్​పేటలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్​రెడ్డితోపాటు 21 మందిపై పోలీసులు కుట్రతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తమపై కేసులు బనాయించిందని లెఫ్ట్​ నాయకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్..​ లెఫ్ట్​ పార్టీల మధ్య సఖ్యత బెడిసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భూపోరాటాలా? రాజకీయమా?

వారం రోజులుగా సీపీఎం, సీపీఐ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూపోరాటాలకు దిగాయి. హైదరాబాద్​ సిటీలో పెద్ద అంబర్‌‌పేట మున్సిపాలిటీ పరిధిలోని పాపాయిగూడెంలో భూదాన్ భూముల్లో కూనంనేని ఆధ్వర్యంలో నిరుపేదలు జెండాలు పాతారు. ఇటీవల వరంగల్​ ఉమ్మడి జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో జరిగిన ఆందోళనల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. మిత్రపక్షాలు చేపట్టే ఆందోళనలను సంప్రదింపులతో విరమింపజేసే అవకాశముండగా.. బీఆర్ఎస్ వారిని దూరం పెట్టడం, ఏకంగా కేసులు పెట్టడం వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఎన్నిక సందర్భంగా లెఫ్ట్​ నేతలకు కేసీఆర్​ ఇచ్చిన హా మీలేవీ నెరవేర్చలేదని.. అందుకే కామ్రేడ్లు ఆందోళనలు చేపడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..

మునుగోడు ఉపఎన్నికకు ముందు కేసీఆర్.. లెఫ్ట్​ పార్టీలను ఆకాశానికి ఎత్తారు. సీపీఐ, సీపీఎం లీడర్లను ప్రగతి భవన్​కు స్వయంగా ఆహ్వానించి చర్చలు జరిపారు. ఆ వివరాలేవీ బయటకు రాకపోయినా.. బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్​తో కలిసినట్లు కామ్రేడ్లు ప్రకటిం చారు. మునుగోడు ఎన్నికలో బీఆర్ఎస్​ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అక్కడ బీఆర్ఎస్​ గెలు పుతో వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ, ఎర్రజెండాల పొత్తు ఖాయమనే ప్రచారం సాగింది. తమ వల్లనే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినట్లు చెప్పుకునేందుకు సీపీఐ, సీపీఎం లీడర్లు పోటీ పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏయే సీట్లలో తాము పోటీ చేయాలో లెక్కలేసుకునే పనిలో పడ్డారు. కమ్యూనిస్టులతో పొత్తు వల్ల తమ టికెట్​ ఎక్కడ పోతుందోనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్​ నిర్వహించిన తొలి బహిరంగ సభకు వామపక్షాలు తమ వంతు సపోర్ట్ చేశాయి. దీంతో.. ఈ దోస్తీ బలపడినట్లు కనిపించింది. కానీ ఖమ్మం సభ తర్వాత లెఫ్ట్​ పార్టీలు భూపోరాటాలకు పిలుపునివ్వటం, లీడర్లపై కేసులు బుక్​ చేయాలని ఆదేశించడంతో గ్యాప్​కు కారణమని సమాచారం.