సావరిన్ ​గోల్డ్ బాండ్లపై మోజు

సావరిన్ ​గోల్డ్ బాండ్లపై మోజు

ముంబై: అమెరికాతోపాటు, పశ్చిమ దేశాలలోని బ్యాంకింగ్​ క్రైసిస్​ ఎఫెక్ట్​తో మన దేశంలో  సావరిన్​ గోల్డ్​ బాండ్లపై మోజు పెరిగింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో చివరిదైన సావరిన్​ గోల్డ్​ బాండ్​ (ఎస్​జీబీ) ఇష్యూను ఇటీవలే రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ముగించింది. నవంబర్​ 2015 లో సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ స్కీమును తెచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తం 100 టన్నుల బంగారానికి  సమానమైన పెట్టుబడులు పెట్టారు. డెట్​ ఫండ్స్​కు ఇప్పటిదాకా ఇస్తున్న పన్ను రాయితీలు ఉపసంహరించడంతో, గోల్డ్​ ఎక్స్చేంజ్​ ట్రేడెడ్​ ఫండ్స్​(ఈటీఎఫ్​) నుంచి సావరిన్​ గోల్డ్​ బాండ్స్​లోకి పెట్టుబడులు మరింత ఎక్కువవుతాయని పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

తాజా ఇష్యూ సూపర్​ సక్సెస్​....

తాజా సావరిన్​ గోల్డ్​ బాండ్​ ఇష్యూ మార్చి 6 నుంచి మార్చి 10 వరకూ అందుబాటులో ఉంది. ఈ ఇష్యూలో ఏకంగా 3.53 టన్నుల బంగారానికి సమానమైన పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెచ్చించడం విశేషం. గడచిన 22 నెలల్లో ఇదే అతి ఎక్కువ. తాజా ఇష్యూ తర్వాత ఎస్​జీబీ కింద మొత్తం అవుట్​స్టాండింగ్​ బాండ్స్​ పరిమాణం 101.57 టన్నులకు చేరింది. మరో విధంగా చెప్పాలంటే, విలువ పరంగా ఎస్​జీబీలలో పెట్టుబడులు రూ. 44,937 కోట్లకు చేరాయి. అంతే కాదు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి ఈ పెట్టుబడులు మ్యూచువల్​ ఫండ్​ గోల్డ్​ ఈటీఎఫ్​ స్కీములలోని ఎసెట్స్​ను మించిపోయాయి.  ఈ ఫిబ్రవరి చివరి  నాటికి మ్యూచువల్​ ఫండ్స్​ గోల్డ్​ ఈటీఎఫ్​ స్కీములలో పెట్టుబడులు రూ. 21,400 కోట్లు. మే 2021 లో వచ్చిన ఎస్​జీబీ ఇష్యూలో గరిష్టంగా 5.3 టన్నుల బంగారానికి సమానమైన యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.

దీని తర్వాత తాజా మార్చి ఎస్​జీబీ ఇష్యూలో  3.53 టన్నుల బంగారానికి సమానమైన యూనిట్లలో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్​ చేశారు. సావరిన్​ గోల్డ్​ బాండ్స్​పై లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​ ట్యాక్స్​ లేదు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్​ల నుంచి పెట్టుబడులు ఇక మీదట సావరిన్​ గోల్డ్​బాండ్స్​ వైపు మళ్లే ఛాన్స్​లు ఎక్కువని ప్లాన్​రూపీ ఇన్వెస్ట్​మెంట్​ సర్వీసెస్​ ఫౌండర్​ అమోల్​ జోషి చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలోని బ్యాంకింగ్​ సమస్యల కారణంగానే తాజా ఎస్​జీబీ ఇష్యూ కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారని ఎనలిస్టులు అన్నారు. మరో రెండు క్వార్టర్ల దాకా గోల్డ్‌‌  రేట్లు పై లెవెల్​లోనే కొనసాగొచ్చని అంచనావేశారు.

మార్కెట్లోని ఇప్పటి వడ్డీ రేట్లు, మాక్రో ఎకనమిక్​ పరిస్థితులు, గ్లోబల్​గా ఉన్న రాజకీయ అనిశ్చితి వంటి వాటి వల్ల బంగారంలో పెట్టుబడులే ఆకర్షణగా నిలుస్తాయి. ఇండియాలో ఎస్​జీబీలు మంచి ఇన్వెస్ట్​మెంట్​ ఆప్షన్​. పైన చెప్పుకున్న కారణాల వల్ల బంగారం రేట్లు రాబోయే ఆరు నెలల్లో పై లెవెల్లోనే నిలకడగా కొనసాగుతాయి. 2024 లో  బంగారం రేట్లలో  కరెక్షన్​ రావొచ్చు. - శేఖర్​ భండారి , ప్రెసిడెంట్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్